దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ బ్లాక్ డీల్స్ చోటుచేసుకున్నాయి. రూబికాన్ రీసెర్చ్, అపోలో టైర్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ, వెల్‌స్పన్ కార్ప్ కంపెనీల్లో ప్రమోటర్లు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు భారీగా వాటాలను విక్రయించగా.. సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు.
రూబికాన్ రీసెర్చ్.. డీల్ విలువ రూ. 2,300 కోట్లు
ఫార్మాస్యూటికల్ కంపెనీ రూబికాన్ రీసెర్చ్‌లో ప్రమోటర్ సంస్థలలో ఒకటైన జనరల్ అట్లాంటిక్ 8.38 శాతం వాటా విక్రయించింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో పలు బ్లాక్ డీల్స్ ద్వారా 1,38,53,073 షేర్లను(8.38 శాతం వాటా) విక్రయించింది. ఒక్కో షేరుకీ రూ. 1,660 సగటు ధరలో చేపట్టిన విక్రయం ద్వారా దాదాపు రూ. 2,300 కోట్లు అందుకుంది. దీంతో రూబికాన్ రీసెర్చ్‌లో జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఆర్‌ఆర్ పీటీఈ వాటా 35.83 శాతం నుంచి 27.45 శాతానికి క్షీణించింది.
వెరసి కంపెనీ మొత్తం ప్రమోటర్ల వాటా 59.76 శాతం నుంచి 51.38 శాతానికి తగ్గింది. ఈ వాటాను దేశ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ సంస్థలు కొనుగోలు చేశాయి. జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ ప్రు, ఎస్‌బీఐ, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్‌తోపాటు.. నోమురా ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మదర్ ఫండ్, అరండా ఇన్వెస్ట్‌మెంట్స్ పీటీఈ, వీఈఎంఎఫ్–ఏ ఎల్‌పీ తదితరాలున్నాయి.
అపోలో టైర్స్.. డీల్ విలువ రూ. 1,175 కోట్లు
పీఈ దిగ్గజం వార్‌బర్గ్ పింకస్ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా తాజాగా అపోలో టైర్స్‌లో 4.25 శాతం వాటా విక్రయించింది. ఎన్‌ఎస్‌ఈ బ్లాక్ డీల్స్ ప్రకారం అనుబంధ సంస్థ ఎమరాల్డ్ సేజ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా 2,70,10,000 షేర్లను(4.25 శాతం వాటా) విక్రయించింది. ఒక్కో షేరుకీ రూ. 435 సగటు ధరలో చేపట్టిన విక్రయంతో దాదాపు రూ. 1,175 కోట్లు అందుకుంది.
దీంతో అపోలో టైర్స్‌లో ఎమరాల్డ్ సేజ్ వాటా 9.93 శాతం నుంచి 5.68 శాతానికి క్షీణించింది. ఈ వాటాలో ఐసీఐసీఐ ప్రు ఎంఎఫ్ ఎమర్జింగ్ 3 శాతం వాటాను రూ. 830 కోట్లకు కొనుగోలు చేయగా.. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 56.32 లక్షల షేర్లు(రూ. 245 కోట్లు), బజాజ్ లైఫ్ 22.98 లక్షల షేర్లు(రూ. 100 కోట్లు) చొప్పున సొంతం చేసుకున్నాయి.
ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ.. డీల్ విలువ రూ. 3,030 కోట్లు
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీలో హాంకాంగ్ సంస్థ ప్రుడెన్షియల్ పీఎల్‌సీ 1.99 శాతం వాటా విక్రయించింది. బీఎస్‌ఈ బ్లాక్ డీల్స్ ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 98,85,169 షేర్లను(1.99 శాతం వాటా) విక్రయించింది. ఒక్కో షేరుకీ రూ. 3,065.5 సగటు ధరలో చేపట్టిన విక్రయం ద్వారా రూ. 3,030 కోట్లు అందుకుంది. దీంతో ఐసీఐసీఐ ప్రు ఏఎంసీలో ప్రుడెన్షియల్ వాటా 32.6 శాతానికి పరిమితమైంది. వెరసి కంపెనీలో సంయుక్త ప్రమోటర్ల వాటా 87.6 శాతం నుంచి 85.6 శాతానికి తగ్గింది. ఈ వాటా కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు.
వెల్‌స్పన్ కార్ప్.. డీల్ విలువ రూ. 1,433 కోట్లు
న్యూఢిల్లీ: బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీ వెల్‌స్పన్ కార్ప్‌లో ప్రమోటర్లు 2.39 శాతం వాటా విక్రయించారు. ఎన్‌ఎస్‌ఈ బ్లాక్ డీల్స్ వివరాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 63 లక్షల షేర్లను(2.39 శాతం వాటా) విక్రయించారు. ఒక్కో షేరుకీ రూ. 2,437.3 సగటు ధరలో చేపట్టిన విక్రయం ద్వారా రూ. 1,433 కోట్లకుపైగా అందుకున్నారు. వెల్‌స్పన్ ఇన్వెస్ట్‌మెంట్ కమర్షియల్ 60 లక్షల షేర్లు(2.27 శాతం వాటా), వెల్‌స్పన్ సీఈవో, ఎండీ విపుల్ మాథుర్ 3 లక్షల షేర్లు చొప్పున విక్రయించారు. దీంతో వెల్‌స్పన్ కార్ప్‌లో వెల్‌స్పన్ ఇన్వెస్ట్‌మెంట్ వాటా 2.56 శాతం నుంచి 0.29 శాతానికి పరిమితమైంది. వెరసి కంపెనీలో మొత్తం ప్రమోటర్ల వాటా 49.73 శాతం నుంచి 47.46 శాతానికి తగ్గింది. ఈ షేర్లను దేశీ ఫండ్స్‌తోపాటు.. క్యాపిటల్ గ్రూప్(1.81 శాతం వాటా), అబెర్డీన్ ఇన్వెస్ట్‌మెంట్స్ కొనుగోలు చేశాయి.


