8–9 దేశాలతో చర్చలు షురూ
కేంద్ర మంత్రి గోయల్ వెల్లడి
ఉమ్మడిగా సుమారు 15 లక్షల కోట్ల డాలర్ల విలువైన 8–9 దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై చర్చలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తాజాగా పేర్కొన్నారు. తద్వారా ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 75 శాతానికి సమానమైన ఎఫ్‌టీఏలకు వీలున్నట్లు తెలియజేశారు. ఇది గ్లోబల్ ట్రేడ్ వేల్యూ చైన్‌లో ఇండియా విశ్వసించదగిన భాగస్వామిగా అవతరించేందుకు వీలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
గత నాలుగేళ్లలో 9 ఎఫ్‌టీఏలు కుదుర్చుకోవడం ద్వారా దేశీయంగా భారీ మార్కెట్ కలిగి ఉన్న భారత్.. ప్రపంచానికి ద్వారాలు తెరిచిందని పేర్కొన్నారు. ఈ 9 ఎఫ్‌టీఏల ద్వారా 38 అభివృద్ధి చెందిన దేశాలతోపాటు.. ఉమ్మడిగా 60 లక్షల కోట్ల డాలర్ల విలువైన జీడీపీని కవర్ చేస్తున్నట్లు వివరించారు. భారత్, జపాన్ వ్యాపార ప్రతినిధులతో ఏర్పాటు చేసిన వేదికపై గోయల్ ఇంకా పలు అంశాలపై ప్రసగించారు. దేశీయంగా జపనీస్ దిగ్గజాల పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతూ గోయల్ 200 మంది వ్యాపార ప్రతినిధులతో ఇక్కడ పర్యటిస్తున్నారు. దేశీయంగా డేటా సెంటర్లు, తయారీ, ఏఐ తదితర రంగాలలో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నట్లు ప్రస్తావించారు.
ఆర్థిక ఒప్పందాలు రెండు దేశాల మధ్య సమతూక వాణిజ్యానికి దారి చూపుతాయని అభిప్రాయపడ్డారు. దేశీయంగా అంతరిక్ష రంగంలో అత్యధిక అవకాశాలున్నాయని, ఇందుకు ప్రయివేట్ పెట్టుబడులకు వీలుగా తలుపులు తెరిచామని తెలియజేశారు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న 20 పారిశ్రామిక స్మార్ట్ నగరాలలో యూనిట్లను ఏర్పాటు చేయవలసిందిగా జపనీస్ దిగ్గజాలకు ఆహ్వానం పలికారు.


