గెలుపు చేజారె... | India vs Sri Lanka second Test draw | Sakshi
Sakshi News home page

గెలుపు చేజారె...

Aug 28 2026 4:43 AM | Updated on Aug 28 2026 4:43 AM

India vs Sri Lanka second Test draw

భారత్, శ్రీలంక రెండో టెస్టు ‘డ్రా’

పట్టుదలగా పోరాడిన లంక బ్యాటర్లు 

దినూషా అజేయ సెంచరీ

ప్రత్యర్థి ఆధిక్యం 16 పరుగులు మాత్రమే... మిగిలిన 4 వికెట్లు తీసేందుకు ఎంతో సమయం పట్టదు...ఆ తర్వాత ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించడమే మిగిలింది... సిరీస్‌ను 2–0తో క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయం... రెండో టెస్టు చివరి రోజు మైదానంలోకి దిగే ముందు భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు సగటు అభిమాని కూడా బహుశా ఇదే తరహాలో అనుకొని ఉంటారు. కానీ శ్రీలంక మాత్రం భిన్నంగా ఆలోచించింది... యువ బ్యాటర్‌ సోనాల్‌ దినూషా అయితే అసాధారణ ఆటకు మారుపేరుగా నిలిచాడు. 

టీమిండియాకు విజయం దక్కకుండా అడ్డుగోడలా అతను మారగా... లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు కూడా పట్టుదలతో అండగా నిలిచారు. ఫలితంగా మ్యాచ్‌ ‘డ్రా’... సునాయాసంగా గెలుస్తుందనుకున్న టెస్టును బౌలింగ్‌ వైఫల్యం, వ్యూహాత్మక లోపాలతో చివరకు శుబ్‌మన్‌ గిల్‌ బృందం సమంగా ముగించాల్సి వచ్చింది. పేరుకు సిరీస్‌ 1–0తో భారత్‌ నెగ్గినా... వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) కోణంలో చూస్తే స్వయంకృతంతో విలువైన పాయింట్లు చేజార్చుకున్నట్లే!

కొలంబో: తొలి రోజు నుంచి భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించిన రెండో టెస్టు మ్యాచ్‌ చివరకు ‘డ్రా’గా ముగిసింది. గురువారం ముగిసిన ఈ పోరులో శ్రీలంక బ్యాటర్ల పోరాటంతో టీమిండియాకు విజయం చేజారింది. ఓవర్‌నైట్‌ స్కోరు 229/6తో చివరి రోజు ఆట కొనసాగించిన శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌ను 154 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 429 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. 

సోనాల్‌ దినూషా (264 బంతుల్లో 133 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగగా, కెషారా నువాంతా (150 బంతుల్లో 46; 4 ఫోర్లు) రాణించాడు. 216 పరుగుల ఆధిక్యంతో లంక ఆట ముగించాక మిగిలిన 15 ఓవర్ల సమయంలో ఛేదన అసాధ్యం కాబట్టి ఇరు జట్ల ఆటగాళ్లు ‘షేక్‌ హ్యాండ్‌’లతో మైదానం వీడారు. తొలి టెస్టు నెగ్గిన భారత్‌ 1–0తో సిరీస్‌ సొంతం చేసుకుంది. దినూషా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా, మొత్తం 328 పరుగులు చేసిన దేవదత్‌ పడిక్కల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది.  

లోయర్‌ ఆర్డర్‌ అండతో... 
292 (48.4 ఓవర్లు)... శ్రీలంక 8, 9, 10, 11 స్థానాల బ్యాటర్లు కలిపి ఇన్ని బంతులు ఆడారంటే వారి ప్రతిఘటన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు! ఒకవైపు దినూషా చక్కటి బ్యాటింగ్‌ ప్రదర్శనను కనబర్చగా, మరో ఎండ్‌నుంచి దక్కిన మద్దతు లంకను గట్టెక్కించింది. పిచ్‌ బాగా నెమ్మదించడంతో ఒక్కో వికెట్‌ కోసం భారత్‌ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 

దినూషా, నువాంతా ఏడో వికెట్‌కు 112 పరుగులు (246 బంతుల్లో) జోడించారు. ఆ తర్వాత ప్రభాత్‌ జయసూర్య (28 బంతుల్లో 2), లాహిరు కుమార (90 బంతుల్లో 12; 1 ఫోర్‌) భారత బౌలర్లను ఆటాడుకున్నాడు. టీ విరామం తర్వాత తొలి బంతికే దినూషా సెంచరీ (196 బంతుల్లో) పూర్తయింది. సిరీస్‌లో అతనికిది మూడో శతకం. ఎట్టకేలకు కుమారను కూడా భారత్‌ అవుట్‌ చేసినా... దినూషా, అసిత ఫెర్నాండో (24 బంతుల్లో 0 నాటౌట్‌) కలిసి అభేద్యంగా మరో 56 బంతులు ఆడి లాంఛనం ముగించారు.

3 వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో (ఫాలోఆన్‌ ఆడుతూ) సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా దినూషా నిలిచాడు. గతంలో భారత ప్లేయర్‌ విజయ్‌ హజారే (1948లో అడిలైడ్‌లో ఆ్రస్టేలియాపై; 116, 145), జింబాబ్వే ప్లేయర్‌ ఆండీ ఫ్లవర్‌ (2001లో హరారేలో దక్షిణాఫ్రికాపై; 142, 199 నాటౌట్‌) ఈ ఫీట్‌ నమోదు చేశారు.

1 శ్రీలంకను భారత్‌ 9 సార్లు ఫాలోఆన్‌ ఆడించగా... టీమిండియా గెలవకపోవడం ఇదే తొలిసారి.

స్కోరు వివరాలు  ; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 503/9 డిక్లేర్డ్‌; శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: 290; శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ (ఫాలోఆన్‌): ఉడారా (సి) సారాంశ్‌ (బి) సిరాజ్‌ 3; మిషారా (ఎల్బీ) (బి) జడేజా 32; సూర్యబండారా (స్టంప్డ్‌) పంత్‌ (బి) సుతార్‌ 92; కమిందు (సి) గిల్‌ (బి) ప్రసిధ్‌ 55; ధనంజయ (సి) పడిక్కల్‌ (బి) సుతార్‌ 23; దినూషా (నాటౌట్‌) 133; డిక్‌వెలా (ఎల్బీ) (బి) సారాంశ్‌ 6; నువాంతా (సి)జురేల్‌ (బి) సుతార్‌ 46; ప్రభాత్‌ (సి) జురేల్‌ (బి) జడేజా 2; లాహిరు కుమార (సి) జైస్వాల్‌ (బి) జడేజా 12; అసిత ఫెర్నాండో (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (154 ఓవర్లలో 9వికెట్లకు డిక్లేర్డ్‌) 429. వికెట్ల పతనం: 1–5, 2–63, 3–178, 4–209, 5–212, 6–218, 7–330, 8–355, 9–402. బౌలింగ్‌: ప్రసిధ్‌ 18.3–3–57–1, సిరాజ్‌ 15–7–26–1, సుతార్‌ 41–7–121–3, సారాంశ్‌ 37–4–98–1, జడేజా 38.3–4–94–3, గిల్‌ 2–0–8–0, జైస్వాల్‌ 1–0–9–0, జురేల్‌ 1–0–1–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement