వరుస సెంచరీలు!.. చరిత్ర సృష్టించిన సొనాల్‌ దినుష | IND vs SL: Sonal Dinusha Creates History Becomes First Asian Player To | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన వరుస సెంచరీల వీరుడు సొనాల్‌ దినుష

Aug 27 2026 4:06 PM | Updated on Aug 27 2026 4:34 PM

IND vs SL: Sonal Dinusha Creates History Becomes First Asian Player To

PC: SLC X

శ్రీలంకతో రెండో టెస్టులో టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐదో ఆరోజు ఆటలో లంకను త్వరగా అవుట్‌ చేయాలన్న భారత జట్టు ఆశలపై సొనాల్‌ దినుష నీళ్లు చల్లాడు. వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో శతక్కొట్టి శ్రీలంకకు ఊపిరిలూదాడు.

ఈ క్రమంలోనే సొనాల్‌ దినుష సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో టీమిండియాపై ఇంత వరకు ఏ ఆసియా క్రికెటర్‌కూ సాధ్యంకాని ఓ అరుదైన ఘనత సాధించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-26లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంకకు వెళ్లింది.

శతక్కొట్టిన దినుష
గాలె వేదికగా తొలి టెస్టులో టీమిండియా ఆతిథ్య లంకను 165 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో లంక ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ ఆల్‌రౌండర్‌ దినుష మాత్రం అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా శతకం సాధించిన ఈ 25 ఏళ్ల లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులు చేశాడు.

ఇక కొలంబో వేదికగా రెండో టెస్టులో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 503-9 వద్ద తమ మొదటి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. అనంతరం శ్రీలంకను 290 పరుగులకే ఆలౌట్‌ చేసింది. దీంతో భారత్‌కు 213 పరుగుల ఆధిక్యం లభించగా శ్రీలంకను ఫాలో ఆన్‌ ఆడమని చెప్పింది.

వరుసగా రెండో సెంచరీ
ఇదిలా ఉంటే.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగుల స్కోరు చేయడంలో సొనాల్‌ దినుషదే కీలక పాత్ర. ఏడో స్థానంలో వచ్చిన అతడు 162 బంతులు ఎదుర్కొని 103 పరుగులు సాధించాడు. ఇక ఫాలో ఆన్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో లంక తేలిగ్గానే తలవొంచుతుందని భావించిన టీమిండియా దినుష ఊహించని షాకిచ్చాడు.

తొలి ఆసియా బ్యాటర్‌గా..
ఆఖరిదైన గురువారం రోజు ఆటలో ఏడు పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో మొదలుపెట్టిన దినుష.. అనూహ్య రీతిలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ బ్రేక్‌ తర్వాత తొలి బంతికే రెండు పరుగులు తీసి వంద పరుగుల మార్కు అందుకున్న అతడు.. జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు.

ఇక ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన సొనాల్‌ దినుష.. టీమిండియాతో టెస్టుల్లో ఆడిన తొలి నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన ఏకైక ఆసియా బ్యాటర్‌గా నిలిచాడు. గాలె టెస్టులో 100, 84.. కొలంబోలో 103, 100* స్కోర్లు సాధించి ఈ అరుదైన ఘనత అందుకున్నాడు.

చదవండి: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్‌ కుమారుడికి చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement