PC: BCCI X
అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) సంచలన ప్రకటన జారీ చేసింది. భారత్‌లో టీమిండియాతో జరిగే టీ20 సిరీస్‌కు సంబంధించిన ప్రసార హక్కులను పాకిస్తాన్‌కు చెందిన సంస్థకు అప్పగించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సిరీస్ నిర్వహణపై ముందుకు సాగుతుందా? లేదంటే నిర్ణయం వెనక్కి తీసుకుంటుందా? అన్న చర్చ మొదలైంది.
కాగా తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్‌లో సొంతంగా ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించే అవకాశం లేదు. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదంటే భారత్‌లో ఇప్పటికే పలు మ్యాచ్‌లకు అఫ్గాన్ బోర్డు ఆతిథ్యం ఇచ్చింది. ఈ క్రమంలోనే సెప్టెంబరులో భారత్ వేదికగా టీమిండియాకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఇందులో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియాతో సెప్టెంబరు 13-17 మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఈ సిరీస్‌కు సంబంధించిన మీడియా హక్కులను పాక్‌కు చెందిన టీజీ (ట్రాన్స్ గ్రూప్)నకు అప్పగించినట్లు అఫ్గాన్ బోర్డు తాజాగా ప్రకటన విడుదల చేసింది.
‘‘ఏసీబీ గ్లోబల్ మీడియా హక్కుల సిండికేషన్ భాగస్వామిగా టీజీ ఉంటుంది. టీపీటీ360 మీడియా ప్రొడక్షన్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తుంది. ఇండియాలో ఫ్యాన్ కోడ్ ఈ సిరీస్‌ను అధికారికంగా ప్రసారం చేస్తుంది’’ అని అఫ్గాన్ బోర్డు తెలిపింది.
కాగా ట్రాన్స్ గ్రూపునకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో సత్సంబంధాలు ఉన్నాయి. పీసీబీ అంతర్జాతీయ మీడియా హక్కులు కలిగి ఉండటంతో పాటు.. ఆసియా, మధ్యప్రాచ్యంలో ఈ గ్రూపు మేజర్ ఈవెంట్లను ప్రసారం చేస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు కూడా ఈ సంస్థవే.
ఈ నేపథ్యంలో బీసీసీఐ అఫ్గాన్ బోర్డు ప్రకటనపై ఎలా స్పందిస్తుందోనని క్రీడా వర్గాల్లో ఆసక్తి పెరిగింది. కాగా భారత్- పాక్ మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్, టీ20 ప్రపంచకప్-2026 మేజర్ టోర్నీల్లో ఇరుజట్ల ఆటగాళ్లు కనీసం కరచాలనం చేసుకోలేదు.
మరోవైపు.. ఆసియా కప్ ఫైనల్లో పాక్‌ను ఓడించి భారత్ టైటిల్ గెలిచింది. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించగా.. నక్వీ ట్రోఫీని ఇప్పటికీ తన దగ్గరే పెట్టుకున్నాడు.
ఇదిలా ఉంటే.. అఫ్గాన్ జట్టు ఇటీవల భారత్‌లో పర్యటించింది. శుబ్‌మన్ గిల్ సేనతో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడి ఓడిపోయి ఇంటిబాటపట్టింది.
చదవండి: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులకు చోటు


