శ్రీలంక ఆటగాడు సొనాల్ దినుషపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షడు రాజీవ్ శుక్లా ప్రశంసలు కురిపించాడు. సొనాల్ అత్యద్భుతమైన ఆటగాడని.. అతడి ఆట టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ను గుర్తుకుతెస్తోందని కొనియాడాడు.
కాగా టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో గాలెలో జరిగిన తొలి టెస్టులో భారత్ లంకను 165 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది.
దినుష అద్భుత ప్రదర్శన
అయితే, ఈ మ్యాచ్‌లో శ్రీలంక యువ ఆల్‌రౌండర్ సొనాల్ దినుష మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా సెంచరీ (100) చేసి అవుటైన ఈ 25 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులతో ఆకట్టుకున్నాడు.
ఇక కొలంబో వేదికగా ఆదివారం మొదలైన రెండో టెస్టులోనూ సొనాల్ దినుష అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్‌స్లో 163 బంతులు ఎదుర్కొన్న సొనాల్ దినుష.. 103 పరుగులు సాధించాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. పసిందు సూరియబండారా (80)తో కలిసి దినుష జట్టును ఆదుకున్నాడు.
పసిందుతో కలిసి..
అయితే, మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 290 పరుగులకే ఆలౌట్ కావడంతో.. భారత్‌కు 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో టీమిండియా శ్రీలంకను ఫాలో ఆన్ ఆడేందుకు ఆహ్వానించింది. ఈ క్రమంలో పసిందు సూరియబండారా (92), కమిందు మెండిస్ (55) పట్టుదలగా నిలబడ్డారు. దీంతో బుధవారం నాటి నాలుగోరోజు ఆటలో లంక 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది.
ఇక నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి దినుష ఏడు పరుగులు చేశాడు. అయితే, కీలకమైన గురువారం నాటి ఆఖరి రోజు ఆటలో మాత్రం దినుష భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి భోజన విరామ సమయానికి ముందే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ పరిణామాల క్రమంలో రాజీవ్ శుక్లా సొనాల్ దినుషపై ప్రశంసలు కురిపించాడు.
సొనాల్ అత్యద్భుతమైన ఆటగాడు
‘‘శ్రీలంకకు చెందిన సొనాల్ అత్యద్భుతమైన ఆటగాడు. టెండుల్కర్‌లా అనిపిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టుల్లో గొప్ప ఆటగాడిగా ఎదగగల సత్తా అతడికి ఉంది’’ అని రాజీవ్ శుక్లా ఎక్స్ వేదికగా కొనియాడాడు. అయితే, నెటిజన్ల నుంచి ఇందుకు మిశ్రమ స్పందన వస్తోంది. దిగ్గజ సచిన్‌తో అప్‌కమింగ్ ప్లేయర్‌ను ఎలా పోలుస్తారని పలువురు రాజీవ్ శుక్లాను విమర్శిస్తున్నారు.
కాగా గతేడాది దినుష బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికి ఐదు మ్యాచ్‌లలో కలిపి 500కు పైగా పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. సచిన్ టెండుల్కర్ తన రెండున్నర దశాబ్దాల కెరీర్‌లో 200 టెస్టులు ఆడి.. 15,921 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడిగా చెక్కు చెదరని రికార్డు సొంతం చేసుకున్నాడు. అత్యధికంగా 51 టెస్టు సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
చదవండి: IND vs AUS: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులకు చోటు


