విమర్శలపై స్పందించిన డివిలియర్స్‌ | AB De Villiers Reacts To Facing Backlash For Rating Kohli Over Sachin, Says His Opinion Was Misunderstood | Sakshi
Sakshi News home page

తగ్గేదేలే!.. విమర్శలపై స్పందించిన డివిలియర్స్‌

Aug 27 2026 9:09 AM | Updated on Aug 27 2026 11:06 AM

AB De Villiers Reacts To Facing Backlash For Rating Kohli Over Sachin

కోహ్లితో డివిలియర్స్‌ (PC: BCCI/IPL)

టీమిండియా మాజీ క్రికెటర్లు తనపై చేస్తున్న విమర్శలపై సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ స్పందించాడు. గణాంకాలే అన్నింటికీ ప్రామాణికం కాదని.. తాను కేవలం రికార్డులు చూసి మాట్లాడే వ్యక్తిని కాదని స్పష్టం చేశాడు. కాగా భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు సచిన్‌ టెండుల్కర్‌- విరాట్‌ కోహ్లి మధ్య టెస్టుల్లో పోలిక తెస్తూ డివిలియర్స్‌ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

సచిన్‌ కంటే కోహ్లి బెటర్‌
ఉపఖండానికి చెందిన బ్యాటర్లకు విదేశాల్లో సీమింగ్‌ పిచ్‌లపై ఎలా ఆడాలో సచిన్‌ చూపిస్తే.. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ కోహ్లి సచిన్‌నే మించిపోయాడని డివిలియర్స్‌ అన్నాడు. విదేశాల్లోనూ అద్భుతంగా ఆడగలనని సచిన్‌ నిరూపించినప్పటికీ.. అతడు కోహ్లి కంటే స్ట్రాంగ్‌ మాత్రం కాదని పేర్కొన్నాడు.

చిచ్చు పెట్టకు
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు దొడ్డ గణేశ్‌, ఆకాశ్‌ చోప్రా వంటి వాళ్లు డివిలియర్స్‌పై విరుచుకుపడ్డారు. ఇద్దరు టీమిండియా దిగ్గజాల మధ్య పోలిక తెస్తూ సచిన్‌ను అవమానించడం సరికాదని.. భారత క్రికెటర్ల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయవద్దని చురకలు అంటించారు. ఎప్పటికీ సచిన్‌ టెండుల్కరే భారత అత్యుత్తమ బ్యాటర్‌ అని.. అతడిని ఎవరూ అధిగమించలేరని పేర్కొన్నారు.

ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు
ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలపై డివిలియర్స్‌ తాజాగా స్పందించాడు. ‘‘విరాట్‌, సచిన్‌ గురించి నేను చేసిన వ్యాఖ్యలు చాలా మందిని గందరగోళానికి గురిచేశాయి అనుకుంటున్నాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమేనని గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. నా అభిప్రాయం ఏమిటో మాత్రమే చెప్పాను.

సచిన్‌ టీమిండియాను ముందుకు తీసుకువెళ్లి.. ప్రపంచవ్యాప్తంగా నిలకడగా ఎలా ఆడాలో చూపించాడు. అయితే, విరాట్‌ మరో భిన్న దారిని పరిచయం చేశాడు. ముఖ్యంగా షార్ట్‌ బాల్‌ ఆడటంలో రాటుదేలాడు. తద్వారా ప్రత్యర్థికి సరైన కౌంటర్లు ఇచ్చేవాడు.

గణాంకాల కోణంలోనే చూడలేను
నిజానికి స్వదేశంలో కంటే విదేశాల్లో కోహ్లి కెరీర్‌ మరీ అంత గొప్పగా ఏమీ సాగలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ పిచ్‌లపై అతడు ఇబ్బంది పడేవాడు. అయినప్పటికీ అతడు ఎప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. వైఫల్యాల నుంచి త్వరగా తేరుకుని ముందుకు సాగేవాడు.

తన వ్యక్తిత్వం, ఆట తీరు ద్వారా తన చుట్టూ ఉన్న ఎంతో మంది యువ ఆటగాళ్లలో కోహ్లి ఆత్మవిశ్వాసం నింపాడు. సచిన్‌తో పోలిస్తే కోహ్లి గణాంకాలు గొప్పగా ఏమీ లేవని నాకూ తెలుసు. అయితే, ప్రతీసారీ గణాంకాల కోణంలోనే చూడకూడదనేది నా అభిప్రాయం. సచిన్‌, కోహ్లి.. ఇద్దరూ కొత్త తరానికి బాట చూపారు.

నా మాటల్లో తప్పేమీ లేదు
ముఖ్యంగా కోహ్లి ఫిట్‌నెస్‌ ప్రాముఖ్యతతో పాటు.. ఆత్మవిశ్వాసంతో ఎలా ముందుకు సాగాలో చెప్పడానికి చక్కటి ఉదాహరణగా నిలిచాడు’’ అని డివిలియర్స్‌ స్పష్టం చేశాడు. తద్వారా తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని.. ఇది తన అభిప్రాయం మాత్రమేనంటూ భారత మాజీ క్రికెటర్లకు కౌంటర్‌ ఇచ్చాడు.

సచిన్‌ వర్సెస్‌ కోహ్లి.. విదేశీ గణాంకాలు ఇలా
కాగా విదేశాల్లో టెస్టు క్రికెట్‌లో సచిన్‌ టెండుల్కర్‌ ఓవరాల్‌గా 8705 పరుగులు చేయగా.. కోహ్లి 4774 పరుగులు సాధించాడు. ఇక సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి కఠిన పిచ్‌లపై సచిన్‌ 63 టెస్టుల్లో 5387 రన్స్‌ చేయగా.. కోహ్లి 46 టెస్టుల్లో 3661 పరుగులు సాధించాడు. 

అయితే, కోహ్లి కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే టీమిండియా విదేశాల్లో అత్యుత్తమ విజయాలు సాధించింది. నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకుంది. ఇదిలా ఉంటే టెస్టుల్లో సచిన్‌ 51 సెంచరీలతో రికార్డు నెలకొల్పగా.. కోహ్లి 30 సెంచరీలు సాధించాడు. 

చదవండి: IND vs SL: ఫాలో ఆన్‌ ఆడి గెలిచిన జట్లు ఇవే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement