PC: TKR X
వెస్టిండీస్ దిగ్గజం సునిల్ నరైన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో భాగంగా ట్రింబాగో నైట్ రైడర్స్ తరఫున సెయింట్ లూసియా కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా సునిల్ నరైన్ ఈ ఫీట్ నమోదు చేశాడు.
సీఫర్ట్ అజేయ శతకం
ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా స్టేడియంలో టాస్ గెలిచిన ట్రింబాగో నైట్ రైడర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. సెయింట్ లూసియా బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 211 పరుగులు చేసింది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ అజేయ శతకం(61 బంతుల్లో 105 నాటౌట్)తో దుమ్ములేపాడు.
అరుదైన మైలురాయి
ఇక ట్రింబాగో బౌలర్లలో సునిల్ నరైన్, ఉస్మాన్ తారిఖ్, కీరన్ పొలార్డ్ తలా ఒక వికెట్ తీశారు. కాగా లూసియా వన్‌డౌన్ బ్యాటర్ జాన్ కాంప్‌బెల్ (27)ను నరైన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాగా టీ20 క్రికెట్‌లో సునిల్ నరైన్‌కు ఇది 650వ వికెట్ కావడం విశేషం.
6️⃣5️⃣0️⃣ and counting!
Sunil Narine adds to his LEGENDARY Career with his 650th T20 wicket! 🇹🇹 x 🇱🇨#CPL26 #TKRvSLK #BiggestPartyInSport #CricketPlayedLouder #Carib pic.twitter.com/P8i0LkYu99— CPL T20 (@CPL) August 27, 2026
ప్రపంచంలో రెండో క్రికెటర్‌గా..
తన కెరీర్‌లో ఆడిన 611వ టీ20 మ్యాచ్ సందర్భంగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నరైన్.. బౌలింగ్ కెరీర్‌లో ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంతేకాదు టీ20 ఫార్మాట్లో ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.
ఈ జాబితాలో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ముందు వరుసలో ఉన్నాడు. మొత్తంగా ఇప్పటికి 547 మ్యాచ్‌లలో కలిపి రషీద్ ఖాన్ 736 వికెట్లు సాధించి.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
పొలార్డ్ పోరాడినా..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రింబాగో నైట్ రైడర్స్ చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి కేవలం 175 పరుగులకే పరిమితమైంది. తద్వారా సెయింట్ లూసియా చేతిలో 36 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
ఓపెనర్లు కొలిన్ మున్రో (35 బంతుల్లో 48), సునిల్ నరైన్ (14 బంతుల్లో 25) ఓ మోస్తరుగా రాణించగా.. లోయర్ ఆర్డర్‌లో కీరన్ పొలార్డ్ ధనాధన్ దంచికొట్టాడు. మెరుపు అర్ధ శతకం (26 బంతుల్లో 65)తో చెలరేగి జట్టును విజయం దిశగా నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


