విజయానికి చేరువలో... | India on course for victory in second Test | Sakshi
Sakshi News home page

విజయానికి చేరువలో...

Aug 27 2026 3:52 AM | Updated on Aug 27 2026 3:52 AM

India on course for victory in second Test

రెండో టెస్టులో గెలుపు దిశగా భారత్‌

శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 229/6

16 పరుగుల ఆధిక్యంలో ఆతిథ్య జట్టు

రాణించిన సూర్యబండారా, కమిందు

కొలంబో: శ్రీలంక పర్యటన ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్లు సాధించాలని పట్టుదలగా బరిలోకి దిగిన భారత జట్టు దాదాపుగా ఆ లక్ష్యాన్ని అందుకోవడం ఖాయమైంది. తొలి టెస్టులో గెలిచిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్టులో కూడా విజయానికి చేరువైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం కోల్పోయి ‘ఫాలోఆన్‌’ ఆడిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో కొంత పట్టుదల కనబర్చింది. 

మ్యాచ్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 72.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. పసిందు సూర్యబండారా (173 బంతుల్లో 92; 10 ఫోర్లు, 1 సిక్స్‌), కమిందు మెండిస్‌ (92 బంతుల్లో 55; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించారు.

ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీ భాగస్వామ్యాలతో లంక కోలుకున్నట్లు కనిపించినా... కీలక సమయాల్లో భారత్‌ ఈ జోడీలను విడదీసి పట్టు సాధించింది. ప్రస్తుతం లంక 16 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. చివరి రోజు భారత బౌలర్లు చకచకా మిగిలిన నాలుగు వికెట్లు తీస్తే స్వల్ప లక్ష్య ఛేదన భారత్‌ ధనాధన్‌గా ముగించడం ఖాయం. వర్షం పడే అవకాశం ఉన్నా... గురువారం మొత్తం ఆ ప్రభావం ఉండకపోవచ్చు.  

దినూషా సెంచరీ... 
అంతకుముందు మరో 39 పరుగులు చేసి ఫాలోఆన్‌ తప్పించుకునే లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ఆ ప్రయత్నంలో సఫలం కాలేకపోయింది. ఓవర్‌నైట్‌ స్కోరు 265/8తో ఆట కొనసాగించిన లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 89.4 ఓవర్లలో 290 పరుగులకు ఆలౌటైంది. మొత్తం 6 ఓవర్లు ఎదుర్కొన్న జట్టు 25 పరుగులు జోడించి మిగిలిన 2 వికెట్లు కోల్పోయింది. సోనాల్‌ దినూషా (162 బంతుల్లో 103; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సిరీస్‌లో వరుసగా రెండో సెంచరీని పూర్తి చేసుకోగా... ప్రసిధ్‌ కృష్ణ, మానవ్‌ సుతార్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. 213 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన భారత్‌...ఆతిథ్య జట్టును ఫాలోఆన్‌ ఆడించింది. వర్షం ఇబ్బంది కలిగించడంతో నాలుగో రోజు మొత్తం 78.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.  

కీలక భాగస్వామ్యాలు... 
శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ కూడా తడబడుతూనే మొదలైంది. సిరాజ్‌ తన రెండో ఓవర్లోనే ఉడారా (3)ను అవుట్‌ చేసి తొలి వికెట్‌ అందించాడు. అయితే సూర్యబండార, కామిల్‌ మిషారా (39 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) వరుసగా స్వీప్, రివర్స్‌ స్వీప్‌లతో భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 68 బంతుల్లోనే 58 పరుగులు జోడించారు. 17 పరుగుల వద్ద సూర్యబండారా ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను సిరాజ్‌ వదిలేయడం కూడా లంకకు కొంత కలిసొచ్చింది. 

మరోసారి స్వీప్‌ షాట్‌కు యత్నించి జడేజా బౌలింగ్‌లో మిషారా అవుట్‌ కాగా... కమిందు సహచరుడికి అండగా నిలిచాడు. 78 బంతుల్లో బండారా హాఫ్‌ సెంచరీ పూర్తయింది. సుతార్‌ బౌలింగ్‌లో రెండు భారీ సిక్స్‌లు బాదిన కమిందు... ప్రసిధ్‌ ఓవర్లోనూ ఫోర్, సిక్స్‌ కొట్టి దూకుడు ప్రదర్శించాడు. 87 బంతుల్లో అతను అర్ధ సెంచరీను అందుకున్నాడు. ఎట్టకేలకు ప్రసిధ్‌ బౌలింగ్‌లోనే గిల్‌ అద్భుత క్యాచ్‌తో కమిందు వెనుదిరగడంతో ఈ శతక భాగస్వామ్యం ముగిసింది. 

టీ విరామానికి లంక 199/3తో మెరుగైన స్థితిలోనే కనిపించింది. అయితే మూడో సెషన్‌లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 9 పరుగుల వ్యవధిలో జట్టు 3 వికెట్లు కోల్పోయింది. సుతార్‌ తన వరుస ఓవర్లలో కెపె్టన్‌ ధనంజయ (23), సూర్యబండారాలను అవుట్‌ చేసి దెబ్బ కొట్టగా, డిక్‌వెలా (6)ను సారాంశ్‌ జైన్‌ పెవిలియన్‌ పంపించాడు. ఆ తర్వాత వర్షం కూడా ఆదుకోవడంతో లంక జాగ్రత్తగా మరో 8.2 ఓవర్లు ఆడి వికెట్‌ కోల్పోకుండా రోజును ముగించింది.  

స్కోరు వివరాలు  
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 503/9 డిక్లేర్డ్‌; శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 290; శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌: ఉడారా (సి) సారాంశ్‌ (బి) సిరాజ్‌ 3; మిషారా (ఎల్బీ) (బి) జడేజా 32; సూర్యబండారా (స్టంప్డ్‌) పంత్‌ (బి) సుతార్‌ 92; కమిందు (సి) గిల్‌ (బి) ప్రసిధ్‌ 55; ధనంజయ (సి) పడిక్కల్‌ (బి) సుతార్‌ 23; దినూషా (బ్యాటింగ్‌) 7; డిక్‌వెలా (ఎల్బీ) (బి) సారాంశ్‌ 6; నువాంతా (బ్యాటింగ్‌) 3; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (72.4 ఓవర్లలో 6 వికెట్లకు) 229. వికెట్ల పతనం: 1–5, 2–63, 3–178, 4–209, 5–212, 6–218. బౌలింగ్‌: ప్రసిధ్‌ 10–1–31–1, సిరాజ్‌ 9–4–11–1, సుతార్‌ 18–2–81–2, సారాంశ్‌ 17.4–3–55–1, జడేజా 18–2–48–1.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement