శాసించేది మనమే! | India dominates second Test | Sakshi
Sakshi News home page

శాసించేది మనమే!

Aug 26 2026 3:57 AM | Updated on Aug 26 2026 3:57 AM

India dominates second Test

రెండో టెస్టులో భారత్‌ పైచేయి

ప్రసిధ్, సుతార్‌లకు మూడేసి వికెట్లు

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 265/8

ఆదుకున్న దినుషా, సూరియబండారా

కొలంబో: ఆహ్వానం లేని అతిథిగా వరుణుడు వస్తూ పోతున్నా... భారత బౌలర్లు సహనం కోల్పోకుండా సత్తా చాటారు. కీలకదశలో శ్రీలంక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించి రెండో టెస్టును శాసించే స్థితిలో టీమిండియాను నిలిపారు. వర్షం, వెలుతురు లేమి కారణంగా వరుసగా మూడో రోజు కూడా పూర్తి ఓవర్లు సాధ్యపడలేదు. ఓవర్‌నైట్‌ స్కోరు 8/2తో మంగళవారం తొలి ఇన్నింగ్స్‌ ను కొనసాగించిన శ్రీలంక జట్టు వర్షం కారణంగా ఆటను నిలిపి వేసే సమయానికి 83.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు సాధించింది. 

పసిందు సూరియబండారా (80; 9 ఫోర్లు), తొలి టెస్టు సెంచరీ హీరో సోనాల్‌ దినుషా (85 బ్యాటింగ్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో శ్రీలంక జట్టును ఆదుకున్నారు. ఫాలోఆన్‌ తప్పించుకోవాలంటే శ్రీలంక మరో 39 పరుగులు సాధించాలి. దినుషాతో కలిసి లాహిరు (8 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. నాలుగో రోజు ఆరంభంలోనే శ్రీలంకను ఆలౌట్‌ చేస్తే భారత్‌ ఈ మ్యాచ్‌పై పూర్తి పట్టుబిగించవచ్చు. ఆ తర్వాత భారత్‌ చకచకా పరుగులు సాధించి లంకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంటుంది.

ధాటిగా ఆడి...
మూడో రోజు తొలి సెషన్‌ ఆరంభంలోనే శ్రీలంకకు దెబ్బ పడింది. ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌లో ఓపెనర్‌ మిషారాను ప్రసిధ్‌ అవుట్‌ చేశాడు. 35/3తో ఎదురీదుతున్న లంకను పసిందు సూరియబండారా, కామిందు మెండిస్‌ (58 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఆదుకున్నారు. వీరిద్దరు ధాటిగా ఆడుతూ నిలకడగా పరుగులు సాధించారు. నాలుగో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. క్రీజులో నిలదొక్కుకుంటున్న కామిందును ప్రసిధ్‌ అవుట్‌ చేసి మళ్లీ లంకను కష్టాల్లోకి నెట్టాడు. గాయపడ్డ రిషబ్‌ పంత్‌ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చన సర్ఫరాజ్‌ ఖాన్, బౌలర్‌ సిరాజ్‌లతో శ్రీలంక బ్యాటర్లు వాగ్వాదం చేశారు. 

లంచ్‌ సెషన్‌లో 122 పరుగులు చేసిన శ్రీలంక రెండో సెషన్‌లో తడబడింది. కెప్టెన్‌ ధనంజయ డిసిల్వా (8) విఫలంకాగా ... సెంచరీపై కన్నేసిన పసిందును జడేజా బౌల్డ్‌ చేశాడు. డిక్‌వెలాను సిరాజ్‌ ఖాతా తెరవనివ్వలేదు. దాంతో 122/3తో కోలుకున్నట్లు కనిపించిన శ్రీలంక 173/7తో మళ్లీ కష్టాల్లో పడింది. శ్రీలంక ఇన్నింగ్స్‌ ముగియడానికి ఎక్కువ సమయం పట్టదేమోనని అనుకున్నా... నువాంతా (74 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్‌), దినుషా మొండిపట్టుదలతో ఆడారు. 

ఒకవైపు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ మరోవైపు పరుగులు సాధించారు. ఈ క్రమంలో దినుషా 82 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీ విరామానికి లంక స్కోరు 216/7. చివరి సెషన్‌లో నువాంతాను సుతార్‌ అవుట్‌ చేసినా... లాహిరు కుమారతో కలిసి దినుషా తొమ్మిదో వికెట్‌కు 35 పరుగులు జత చేసి శ్రీలంక స్కోరును 250 పరుగులు దాటించాడు.

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 503/9 డిక్లేర్డ్‌; శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: ఉడారా (సి) జైస్వాల్‌ (బి) ప్రసిధ్‌ కృష్ణ 1; కమిల్‌ (సి) జురేల్‌ (బి) ప్రసిధ్‌ కృష్ణ 19; ప్రభాత్‌ జయసూరియ (ఎల్బీడబ్ల్యూ) (బి) సుతార్‌ 2; పసిందు సూరియబండారా (బి) జడేజా 80; కామిందు మెండిస్‌ (సి) జడేజా (బి) ప్రసిధ్‌ కృష్ణ 32; ధనంజయ డిసిల్వా (సి) కేఎల్‌ రాహుల్‌ (బి) మానవ్‌ సుతార్‌ 8; సోనాల్‌ దినుషా (బ్యాటింగ్‌) 85; డిక్‌వెల్లా (సి) జురేల్‌ (బి) సిరాజ్‌ 0; కేషారా నువాంతా (సి) సారాంశ్‌ జైన్‌ (బి) మానవ్‌ సుతార్‌ 18; లాహిరు కుమార (బ్యాటింగ్‌) 8; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (83.4 ఓవర్లలో 8 వికెట్లకు) 265. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–35, 4–122, 5–137, 6–171, 7–173, 8–230. బౌలింగ్‌: సిరాజ్‌ 11–0– 33–1, ప్రసిధ్‌ కృష్ణ 14–1–47–3, మానవ్‌ సుతార్‌ 21–1–83–3, సారాంశ్‌ జైన్‌ 18–5– 51–0, రవీంద్ర జడేజా 19.4–4–45–1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement