సెయింట్ లూయిస్ (అమెరికా): గ్రాండ్ చెస్ టూర్ టోర్నీ ఫైనల్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమెర్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రజ్ఞానంద 19–9 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. రెండు క్లాసికల్ గేమ్‌లు ముగిశాక 9–3తో ఆధిక్యంలో నిలిచిన ప్రజ్ఞానంద... తదుపరి ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్ గేమ్‌లలోనూ మెరిశాడు. తొలి ర్యాపిడ్ గేమ్‌లో 49 ఎత్తుల్లో... రెండో ర్యాపిడ్ గేమ్‌లో 27 ఎత్తుల్లో విజయం అందుకున్నాడు.
ఒక్కో విజయానికి నాలుగు పాయింట్లు సాధించిన ప్రజ్ఞానంద 17–3తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. బ్లిట్జ్ ఫార్మాట్‌లో నాలుగు గేమ్‌లు జరిగాయి. తొలి గేమ్‌లోనే ప్రజ్ఞానంద 45 ఎత్తుల్లో నెగ్గి 19–3తో విజయంతోపాటు ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. ఫలితం తేలిపోయినా మిగిలిన మూడు బ్లిట్జ్ గేమ్‌లను కూడా ఆడించగా... ఈ మూడింటిలోనూ విన్సెంట్ కీమెర్ గెలిచి ఆధిక్యాన్ని 9–19కి తగ్గించాడు. ఫైనల్లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ కరువానాతో ప్రజ్ఞానంద తలపడతాడు. రెండో సెమీఫైనల్లో కరువానా 18–9తో వెస్లీ సో (అమెరికా)పై గెలుపొందాడు. 3–4 స్థానాల కోసం కీమెర్, వెస్లీ సో పోటీపడతారు.
టైటిల్ కోసం ప్రజ్ఞానంద, కరువానా మధ్య మొత్తం ఎనిమిది గేమ్‌లు (2 క్లాసికల్, 2 ర్యాపిడ్, 4 బ్లిట్జ్) జరుగుతాయి. గ్రాండ్ చెస్ ఫైనల్స్ టోర్నీని 4,50,000 డాలర్ల (రూ. 4 కోట్ల 29 లక్షలు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్నారు. విజేతకు 2 లక్షల డాలర్లు (రూ.1 కోటీ 90 లక్షలు), రన్నరప్‌కు 1,25,000 డాలర్లు (రూ. 1 కోటీ 19 లక్షలు) అందజేస్తారు. మూడో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 75 వేల డాలర్లు (రూ. 71 లక్షల 50 వేలు), నాలుగో స్థానం పొందిన ప్లేయర్‌కు 50 వేల డాలర్లు (రూ. 47 లక్షల 67 వేలు) లభిస్తాయి.


