ఆధిక్యంలో ప్రజ్ఞానంద | Praggnanandhaa draws first semifinal of Grand Chess Tour Finals | Sakshi
Sakshi News home page

ఆధిక్యంలో ప్రజ్ఞానంద

Aug 25 2026 5:51 AM | Updated on Aug 25 2026 5:51 AM

Praggnanandhaa draws first semifinal of Grand Chess Tour Finals

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ తొలి సెమీఫైనల్లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద ఆధిక్యంలోకి వెళ్లాడు. విన్సెంట్‌ కీమెర్‌ (జర్మనీ)తో జరుగుతున్న సెమీఫైనల్లో రెండు క్లాసికల్‌ గేమ్‌లు ముగిశాక ప్రజ్ఞానంద 9–3తో ఆధిక్యంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య తొలి గేమ్‌ 80 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. రెండో గేమ్‌లో ప్రజ్ఞానంద 55 ఎత్తుల్లో కీమెర్‌ను ఓడించాడు. ప్రజ్ఞానంద, కీమెర్‌ల మధ్య ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో రెండు గేమ్‌లు, బ్లిట్జ్‌ ఫార్మాట్‌లో నాలుగు గేమ్‌లు జరగాల్సి ఉన్నాయి. మూడు ఫార్మాట్‌ల గేమ్‌లు ముగిశాక అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్‌ ఫైనల్‌ చేరుకుంటాడు.

 టోర్నీ నిబంధనల ప్రకారం క్లాసికల్‌ గేమ్‌లో గెలిస్తే 6 పాయింట్లు... ‘డ్రా’ చేసుకుంటే 3 పాయింట్లు లభిస్తాయి. క్లాసికల్‌ రెండు గేమ్‌లు ‘డ్రా’గా ముగిస్తే బ్లిట్జ్‌ బోనస్‌ గేమ్‌ను నిర్వహిస్తారు. ఇందులో నెగ్గిన ప్లేయర్‌కు 2 పాయింట్లు దక్కు తాయి. ర్యాపిడ్‌ గేమ్‌లో గెలిస్తే 4 పాయింట్లు.... ‘డ్రా’ చేసుకుంటే 2 పాయింట్లు... బ్లిట్జ్‌ గేమ్‌లో గెలిస్తే 2 పాయింట్లు... ‘డ్రా’ చేసుకుంటే 1 పాయింట్‌ లభిస్తాయి. వెస్లీ సో– కరువానా (అమెరికా) మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్లో క్లాసికల్‌ గేమ్‌లు ముగిశాక కరువానా 8–6తో ముందంజలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య క్లాసికల్‌ గేమ్‌లు ‘డ్రా’ కాగా ... బ్లిట్జ్‌ బోనస్‌ గేమ్‌లో కరువానా 33 ఎత్తుల్లో వెస్లీ సోపై గెలిచి 8–6తో ఆధిక్యంలోకి వెళ్లాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement