సెంచరీ సెలబ్రేషన్‌.. కండల ప్రదర్శనపై జురెల్‌ స్పందన! | Dhruv Jurel Reveals The Story Behind His Jai Jawan And Jai Kisan Tattoo After Century Celebration, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

సెంచరీ సెలబ్రేషన్‌.. కండల ప్రదర్శనపై జురెల్‌ స్పందన!

Aug 24 2026 9:33 PM | Updated on Aug 25 2026 11:41 AM

Dhruv Jurel Reveals Reason-Showing-Tatoo-After-Century-Celebration

Photo Credit: BCCI Twitter

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీతో మెరిశాడు. టెస్టుల్లో ఏడో స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో వచ్చి సెంచరీ బాదిన రెండో భారత బ్యాటర్‌గా జురెల్ రికార్డులకెక్కాడు. సెంచరీ చేసిన వెంటనే గాలిలోకి పిడికిలి బిగించిన జురెల్, ఆ తర్వాత హెల్మెట్ తీసేసి కండలను ప్రదర్శించడం హైలైట్‌గా నిలిచింది. అయితే అతడి ఎడమ చేతి బైసిప్స్‌పై పచ్చబొట్టు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జురెల్ చేతిపై ఉన్న టాటూ ఏంటా అని అభిమానులు ఆరా తీయగా.. ‘జై జవాన్‌.. జై కిసాన్’ అని రాసి ఉండడం కనిపించింది.

సెంచరీ చేయగానే సెలబ్రేషన్స్‌లో భాగంగా జురెల్ కండలు చూపించాడనుకుంటే మాత్రం పొరపాటే అవుతుంది. నిజానికి అతను ప్రదర్శించిన పచ్చబొట్టు వెనుక చిన్న కథ దాగుంది. తాజాగా మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కండలను ప్రదర్శించడం వెనుక దాగున్న అసలు విషయాన్ని ధ్రువ్ జురెల్ పంచుకున్నాడు.

‘కండల ప్రదర్శన ఊరికే చేయలేదు. మా తాత రైతు, తండ్రి సైనికుడు. వారి మూలాలను ఎప్పటికీ మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే కండల ప్రదర్శనతో సెలబ్రేషన్ చేసుకున్నా. ఆ టాటు వెనుక ఉన్న అర్ధం కూడా అదే’ అని జురెల్‌ చెప్పుకొచ్చాడు. సెంచరీ తర్వాత తాను చేసిన సెలబ్రేషన్స్ కూడా తన కుటుంబానికి అంకితం చేశానని జురెల్ పేర్కొన్నాడు.

జురెల్‌ గతంలోనూ భారత్‌ తరపున హాఫ్ సెంచరీ లేదా సెంచరీ చేసిన సందర్భాల్లో తన తండ్రికి నివాళిగా ఆర్మీ సెల్యూట్‌ చేసేవాడు. ఇప్పుడు టాటూను చూపిస్తూ చేసిన  కొత్త రకమైన సెలబ్రేషన్ చేయడం వెనుక, తన కుటుంబ నేపథ్యం ముడిపడి ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.

ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. ప్రస్తుతం లంక జట్టు మరో 495 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్‌, జురెల్ శతకాలతో చెలరేగగా, గిల్‌, పంత్ అర్ధసెంచరీలతో రాణించారు.

 

చదవండి: నిరాశ‌ప‌రిచిన భార‌త్‌.. సెమీస్ చేరకుండానే ఇంటిబాట    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement