రన్నరప్‌ ప్రజ్ఞానంద | Praggnanandhaa finished as the runner up in the Sinquefield Cup Grand Chess Tour tournament | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ ప్రజ్ఞానంద

Aug 21 2026 4:14 AM | Updated on Aug 21 2026 4:14 AM

Praggnanandhaa finished as the runner up in the Sinquefield Cup Grand Chess Tour tournament

గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఫైనల్స్‌కు అర్హత  

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): వరుసగా రెండో ఏడాది సింక్‌ఫీల్డ్‌ కప్‌ గ్రాండ్‌ చెస్‌ టూర్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ సో వెస్లీ వరుసగా రెండో ఏడాది టైటిల్‌ గెలిచాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌)తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 37 ఎత్తుల్లో... సిందరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)తో జరిగిన గేమ్‌ను సో వెస్లీ (అమెరికా) 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. దాంతో ఇద్దరూ 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. 

విజేతను నిర్ణయించేందుకు ప్రజ్ఞానంద, సో వెస్లీ మధ్య ముందుగా రెండు ర్యాపిడ్‌ గేమ్‌లను నిర్వహించారు. తొలి గేమ్‌ 21 ఎత్తుల్లో... రెండో గేమ్‌ 24 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. విజేత ఎవరో తేలకపోవడంతో ఈసారి మూడో గేమ్‌ను ‘అర్మగెడాన్‌’ పద్ధతిలో నిర్వహించారు. అర్మగెడాన్‌ గేమ్‌ నిబంధన ప్రకారం తెల్ల పావులతో ఆడే ప్లేయర్‌ తప్పకుండా నెగ్గాలి. నల్ల పావులతో ఆడే ప్లేయర్‌ గేమ్‌ ‘డ్రా’ చేసుకుంటే గెలిచినట్టు. అర్మగెడాన్‌ గేమ్‌లో నల్లపావులతో ఆడిన సో వెస్లీ 86 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించి 2–1 పాయింట్లతో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

విజేత సో వెస్లీకి 87,500 డాలర్ల (రూ. 83 లక్షల 74 వేలు) ప్రైజ్‌మనీ, రన్నరప్‌ ప్రజ్ఞానందకు 77,500 డాలర్ల (రూ. 74 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరిగిన ఐదు టోర్నీల తర్వాత ప్రజ్ఞానంద (35.5 పాయింట్లు), సో వెస్లీ (34.5 పాయింట్లు), కరువానా (అమెరికా; 29.5 పాయింట్లు), విన్సెంట్‌ కీమెర్‌ (జర్మనీ; 28.5 పాయింట్లు) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈనెల 22 నుంచి 27 వరకు సెయింట్‌ లూయిస్‌లోనే జరిగే గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఫైనల్‌ టోర్నీకి ఈ నలుగురు అర్హత సాధించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement