breaking news
sinquefield Cup
-
ప్రజ్ఞానందకు మరో ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్ఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. శనివారం మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను ప్రజ్ఞానంద 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఈ టోర్నీలో ప్రజ్ఞానందకు ఇది వరుసగా నాలుగో ‘డ్రా’. ఇక ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్... జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్)తో గేమ్‌ను 45 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. సామ్ సెవియాన్ (అమెరికా), నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్)... అరోనియన్ (అమెరికా), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) మధ్య మ్యాచ్‌లు కూడా ‘డ్రా’గా ముగిశాయి. మొత్తంగా శనివారం జరిగిన అన్నీ మ్యాచ్‌లు ‘డ్రా’గానే ముగిశాయి. ఐదు రౌండ్లు ముగిసేసరికి ఫాబియానో కరువానా (అమెరికా) 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రజ్ఞానంద, అరోనియన్ చెరో 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. గుకేశ్, మాక్సిమి లాగ్రెవ్, వెస్లీ సో, అలిరెజా 2.5 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. గ్రాండ్ చెస్ టూర్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ప్లేయర్లు ఫైనల్లో తలపడతారు. -
అజేయంగా ప్రజ్ఞానంద
సింక్ఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద అజేయంగా సంయుక్త ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మూడో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 46 ఎత్తుల్లో... స్యామ్ సెవియాన్ (అమెరికా)తో జరిగిన గేమ్‌ను ప్రపంచ చాంపియన్ గుకేశ్ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. ఇతర గేముల్లో ఫాబియానో కరువానా (అమెరికా) 46 ఎత్తుల్లో అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)పై గెలుపొందగా... అరోనియన్ (అమెరికా)–మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్) గేమ్ 73 ఎత్తుల్లో; వెస్లీ సో (అమెరికా)–జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్) గేమ్ 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. మూడో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద, కరువానా, అరోనియన్ రెండు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. -
గుకేశ్‌కు ప్రజ్ఞానంద షాక్
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్ఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ సంచలన ఫలితంతో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ప్రజ్ఞానంద 36 ఎత్తుల్లో భారత్‌కే చెందిన క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్‌ను ఓడించాడు. ఈ ఫలితంతో ప్రజ్ఞానంద ప్రపంచ చెస్ లైవ్ రేటింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. క్వీన్స్ గాంబిట్ పద్ధతిలో మొదలైన ఈ గేమ్‌లో ప్రజ్ఞానంద ఎత్తులకు సమాధానం ఇచ్చేందుకు గుకేశ్ తీవ్రంగా ఆలోచించాల్సి వచ్చింది. ఒకదశలో సమయాభావంవల్ల గుకేశ్ దీటైన ఎత్తులు వేయలేకపోయాడు. చివరకు 36 ఎత్తులు ముగిశాక గుకేశ్ ఓటమిని అంగీకరించాడు. 10 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 9 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. మరోవైపు లెవోన్ అరోనియన్ (అమెరికా) 41 ఎత్తుల్లో నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందగా... సో వెస్లీ (అమెరికా)–సామ్ సెవియాన్ (అమెరికా) మధ్య గేమ్ 56 ఎత్తుల్లో... అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)–మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్) గేమ్ 58 ఎత్తుల్లో... ఫాబియానో కరువానా (అమెరికా)–జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్) గేమ్ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. -
గుకేశ్‌పైనే దృష్టి
సెయింట్ లూయిస్ (అమెరికా): ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తిరిగి క్లాసికల్ చెస్ పోటీల్లో తలపడేందుకు సిద్ధమయ్యాడు. గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా ఐదో టోర్నీ అయిన సింక్ఫీల్డ్ కప్‌లో భారత్ తరఫున గుకేశ్‌తోపాటు ప్రజ్ఞానంద విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. పదిమంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతుంది. సోమవారం నుంచి ఇక్కడ జరిగే ఈ టోర్నీలో అమెరికా గ్రాండ్‌మాస్టర్లు ఫాబియానో కరువానా, వెస్లీ సో, లెవోన్ అరోనియన్, స్యామ్ సేవియన్లతో పాటు ఫ్రాన్స్‌కు చెందిన మాక్సిమి వాచియెర్ లాగ్రెవ్, అలీరెజా ఫిరూజా... పోలాండ్ స్టార్ జాన్ క్రిస్టోఫ్ డూడా... ఉజ్బెకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్ కూడా పాల్గొంటున్నారు. అయితే ప్రపంచ నంబర్‌వన్, మాజీ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ఆడకపోవడమే టోర్నీకి ప్రధాన లోటు అని చెప్పొచ్చు. ఈ నార్వే గ్రాండ్‌మాస్టర్ క్లాసికల్ చెస్‌ను ఆస్వాదించలేకపోతున్నానని ఇదివరకే ఎన్నోసార్లు స్పష్టం చేశాడు. అందువల్లే ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. అయితే చెస్ దిగ్గజం కార్ల్సన్ లేకపోయినప్పటికీ భారత ఆటగాళ్లకు ప్రధానంగా అమెరికా ఆటగాళ్లు ఆరోనియన్, కరువానా, అలీరెజా నుంచి గట్టిపోటీ తప్పదు. సెయింట్ లూయిస్‌లోనే జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో గుకేశ్ ఆశించినంతగా రాణించలేకపోయాడు. అయితే తనకు పట్టున్న క్లాసికల్ ఫార్మాట్లో సత్తా చాటుకోవడానికి గుకేశ్ రెడీగా ఉన్నాడు. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 3,50,000 డాలర్లు (రూ. 3 కోట్ల 6 లక్షలు). విజేతకు 1,00,000 డాలర్లు (రూ.87 లక్షల 51 వేలు) అందజేస్తారు. రన్నరప్‌గా నిలిచిన ప్లేయర్‌కు 65 వేల డాలర్లు (రూ. 56 లక్షల 88 వేలు), మూడో స్థానం పొందిన ప్లేయర్‌కు 48 వేల డాలర్లు (రూ. 42 లక్షలు) లభిస్తాయి. -
ప్రజ్ఞానంద, గుకేశ్ గేమ్ ‘డ్రా’
సెయింట్ లూయిస్: సింక్ఫీల్డ్ కప్ క్లాసికల్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్ వరుసగా మూడో ‘డ్రా’ నమోదు చేసుకున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన మూడో గేమ్ 62 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద కాటాలాన్ ఓపెనింగ్‌తో గేమ్‌ను ప్రారంభించాడు.మరోవైపు గుకేశ్ తొలి నాలుగు నిమిషాల్లోనే 18 ఎత్తులు పూర్తి చేయగా... ఆచితూచి ఆడిన ప్రజ్ఞానంద 18 ఎత్తులకు ఒక గంట సమయం తీసుకున్నాడు. 34వ ఎత్తుల్లో గుకేశ్ తప్పిదం కారణంగా ప్రజ్ఞానందకు గెలుపు దారులు తెరుచుకున్నాయి. అయితే ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవడంలో ప్రజ్ఞానంద విఫలమయ్యాడు.చివరకు ఇద్దరూ గేమ్‌ను ‘డ్రా’గా ముగించేందుకు అంగీకరించారు. మూడో రౌండ్ తర్వాత గుకేశ్, ప్రజ్ఞానంద ఖాతాలో 1.5 పాయింట్లు ఉన్నాయి. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా గుకేశ్ నాలుగో ర్యాంక్‌లో, ప్రజ్ఞానంద ఏడో ర్యాంక్‌లో ఉన్నారు. -
డింగ్ లిరెన్‌తో గుకేశ్ గేమ్ ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్ఫీల్డ్ కప్ క్లాసికల్ చెస్ టోర్నమెంట్‌ను భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ‘డ్రా’తో ప్రారంభించాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను గుకేశ్ 28 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. డింగ్ లిరెన్, గుకేశ్ మధ్య ఈ ఏడాది నవంబర్‌లో సింగపూర్ వేదికగా ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు తలపడటం ఆసక్తిని కలిగించింది.భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద కూడా తన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. మొత్తం పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు ఫాబియానో కరువానా (అమెరికా), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్), వెస్లీ సో (అమెరికా), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), డింగ్ లిరెన్ (చైనా), ఇయాన్ నెపోమ్నిషి (రష్యా), మాక్సిమి వాచెర్ లెగ్రావ్ (ఫ్రాన్స్), నొదిర్బెక్ మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. -
ఆనంద్‌కు మరో ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్విఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఆరో ‘డ్రా’ నమోదు చేశాడు. మాక్సిమి వాచెర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత ఆనంద్ 5 పాయింట్లతో మాక్సిమి, అరోనియన్ (అర్మేనియా)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో సో వెస్లీ (అమెరికా)తో ఆనంద్ ఆడతాడు. -
ఆనంద్‌కు మరో డ్రా
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్యూ ఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు వరుసగా ఆరోసారి డ్రా ఎదురైంది. టోర్నీలో టాపర్‌గా ఉన్న లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో జరిగిన ఎనిమిదో రౌండ్లో ఆనంద్ 31 ఎత్తుల్లో డ్రాగా ముగించాడు. తొలి రెండు రౌండ్లలో పరాజయాలను ఎదుర్కొన్న ఆనంద్ ప్రస్తుతం మూడు పాయింట్లతో సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఇక చివరి రౌండ్లో తను ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఎదుర్కోనున్నాడు. -
ఆనంద్‌కు మళ్లీ డ్రా
సెయింట్ లూయిస్ : సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. ఆదివారం నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ అనిష్ గిరితో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ రౌండ్ అనంతరం విషీ రెండు పాయింట్లతో సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. నల్లపావులతో ఆడిన ఆనంద్‌కు ఈ టోర్నీలో పెద్దగా కలిసి రావడం లేదు. తొలి రెండు గేమ్‌ల్లో ఓడిన అతను తర్వాత డ్రాలతో సరిపెట్టుకుంటున్నాడు. మరోవైపు తెల్లపావులతో గిరి.. స్లావ్ డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇతర గేమ్‌ల్లో లాగ్రావి (ఫ్రాన్స్-3.5)... తపలోవ్ (బల్గేరియా-3)పై; నకమురా (అమెరికా-3.5)... వెస్లీ సో (అమెరికా-1.5)పై; గ్రిస్చుక్ (రష్యా-3)... కరుణ (అమెరికా-2)పై నెగ్గగా; ఆరోనియన్ (ఆర్మేనియా-4)... కార్ల్సన్ (నార్వే-4)ల మధ్య గేమ్ డ్రాగా ముగిసింది. -
ఆనంద్‌కు మరో ‘డ్రా’
సెయింట్ లూయీస్ (అమెరికా) : సింక్విఫీల్డ్ కప్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మరో డ్రా నమోదు చేశాడు. ఫాబియాన్ కరునా (అమెరికా) జరిగిన నాలుగో గేమ్‌ను ఆనంద్ సమం చేశాడు. ఇందులో ఆనంద్ నల్ల పావులతో బరిలోకి దిగాడు. ఈ టోర్నమెంట్లో తొలి రెండు గేమ్‌లో ఓడిన ఆనంద్‌కు ఇది వరుసగా రెండో డ్రా. 10 మంది అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో తొపలోవ్, ఆరోనియన్ చెరో 3 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. -
ఆనంద్‌కు తొలి ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా) : వరుసగా రెండు పరాజయాల అనంతరం భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఖాతా తెరిచాడు. వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా)తో జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడుతున్న ఈ టోర్నీలో మూడో రౌండ్ తర్వాత ఆనంద్ అర పాయింట్‌తో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. -
ఆనంద్ పరాజయం
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. హికారు నకముర (అమెరికా)తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌లో ఆనంద్ 43 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. మొత్తం 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్లో జరిగిన ఐదు గేముల్లో ఫలితాలు రావడం విశేషం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్న ఎనిమిది మంది క్రీడాకారులు ఈ టోర్నీ బరిలో ఉన్నారు.