
సింక్‌ఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద అజేయంగా సంయుక్త ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మూడో రౌండ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 46 ఎత్తుల్లో... స్యామ్ సెవియాన్ (అమెరికా)తో జరిగిన గేమ్‌ను ప్రపంచ చాంపియన్ గుకేశ్ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు.
ఇతర గేముల్లో ఫాబియానో కరువానా (అమెరికా) 46 ఎత్తుల్లో అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)పై గెలుపొందగా... అరోనియన్ (అమెరికా)–మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్) గేమ్ 73 ఎత్తుల్లో; వెస్లీ సో (అమెరికా)–జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్) గేమ్ 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. మూడో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద, కరువానా, అరోనియన్ రెండు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.