
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్‌ఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. శనివారం మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను ప్రజ్ఞానంద 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఈ టోర్నీలో ప్రజ్ఞానందకు ఇది వరుసగా నాలుగో ‘డ్రా’. ఇక ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్... జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్)తో గేమ్‌ను 45 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. సామ్ సెవియాన్ (అమెరికా), నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్)... అరోనియన్ (అమెరికా), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) మధ్య మ్యాచ్‌లు కూడా ‘డ్రా’గా ముగిశాయి.
మొత్తంగా శనివారం జరిగిన అన్నీ మ్యాచ్‌లు ‘డ్రా’గానే ముగిశాయి. ఐదు రౌండ్లు ముగిసేసరికి ఫాబియానో కరువానా (అమెరికా) 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రజ్ఞానంద, అరోనియన్ చెరో 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. గుకేశ్, మాక్సిమి లాగ్రెవ్, వెస్లీ సో, అలిరెజా 2.5 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. గ్రాండ్ చెస్ టూర్‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ప్లేయర్లు ఫైనల్లో తలపడతారు.