
‘ఐకాన్’ ప్లేయర్లుగా గుకేశ్, ఆనంద్, ప్రజ్ఞానంద
ముంబై: ప్రపంచ చదరంగ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్) ‘ఐకాన్’ ప్లేయర్లుగా వ్యవహరించనున్నారు. గ్లోబల్ చెస్ లీగ్ మూడో సీజన్ ఆటగాళ్ల డ్రాఫ్టింగ్ శుక్రవారం జరగనుంది. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) ఈ టోర్నమెంట్‌కు దూరం కాగా... ఈ ఏడాది డిసెంబర్ 13 నుంచి చెన్నై వేదికగా లీగ్ జరగనుంది. గత రెండు సీజన్‌లను వరుసగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లండన్‌లో నిర్వహించారు.
ఫిడే, టెక్ మహేంద్ర సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో 6 ఫ్రాంఛైజీలు పాల్గొంటున్నాయి. అమెరికా గ్రాండ్‌మాస్టర్లు హికారు నకముర, ఫాబియానో కరువానా, అలీరెజా ఫిరూజా, లాగ్రేవ్ వంటి అంతర్జాతీయ స్టార్‌లు సహా మొత్తం 36 మంది ప్లేయర్లు ఈ డ్రాఫ్టింగ్‌లో పాల్గొననున్నారు. భారత గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్ అర్జున్ ఇరిగేశి, అనీశ్ గిరి, ప్రపంచకప్ రన్నరప్ కోనేరు హంపి కూడా ఇందులో భాగం కానున్నారు.
ఒక్కో ఫ్రాంఛైజీ ‘ఐకాన్ ప్లేయర్స్’, ‘మెన్స్’, ‘వుమెన్స్’, ‘అండర్–21’ వంటి నాలుగు విభాగాల్లో ఆటగాళ్లను ఎంపిక చేసుకోనుంది. ఒక్కో ఫ్రాంచైజీ ఒక ఐకాన్ ప్లేయర్, ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక అండర్–21 ప్లేయర్‌ను కలుపుకొని మొత్తం ఆరుగురిని ఎంపిక చేసుకోవచ్చు.‘జీసీఎల్ కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు. ఇది తెలివితేటలు, సమష్టితత్వం, సృజనాత్మకతకు సంబంధించిన వేడుక. మన దేశం నుంచి ప్రపంచ వేదికపై ఇలాంటి లీగ్ జరుగుతుండటం గర్వంగా ఉంది’ అని ఆనంద్ పేర్కొన్నాడు.