నాలుగో రౌండ్‌కు హరికృష్ణ, అర్జున్
ప్రపంచ కప్ చెస్
పనాజీ (గోవా): ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ కప్ చెస్‌లో ముందంజ వేయడంలో విఫలమయ్యాడు. శనివారం జరిగిన మూడో రౌండ్‌లోనే అతను నిష్క్రమించాడు. జర్మనీకి చెందిన ఫ్రెడరిక్ స్వేన్ 1.5–0.5 తేడాతో గుకేశ్‌ను ఓడించాడు. నల్ల పావులతో తొలి గేమ్‌ను డ్రా చేసుకొని రెండో గేమ్‌లో విజయం కోసం బరిలోకి దిగిన గుకేశ్‌కు నిరాశాజనక ఫలితం ఎదురైంది. స్వేన్ ఒత్తిడిని అధిగమించి 55 ఎత్తుల్లో గెలుపొందాడు.
ఇతర భారత ఆటగాళ్లలో అర్జున్ ఇరిగేశి, పెంటేల హరికృష్ణ, ప్రజ్ఞానంద, ప్రణవ్ నాలుగో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్‌లో ప్రజ్ఞానంద 42 ఎత్తుల్లో ఆర్మేనియాకు చెందిన రాబర్ట్ హావ్‌హనిసన్‌పై గెలుపొందాడు. షంశుద్దీన్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన పోరులో తొలి గేమ్‌ను గెలుచుకున్న అర్జున్ రెండో గేమ్‌లో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా గేమ్‌ను డ్రాగా ముగించి 1.5–0.5తో ముందంజ వేశాడు. తర్వాతి పోరులో పీటర్ లెకో (హంగేరీ)తో అర్జున్ తలపడతాడు.
డానియెల్ డార్దా (బెల్జియం)తో జరిగిన మూడో రౌండ్‌లో తొలి గేమ్‌ను గెలుచున్న హరికృష్ణ తర్వాతి గేమ్‌ను డ్రా చేసుకొని నాలుగో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. మరో వైపు ఈ టోర్నీలో అత్యధిక సీడింగ్ ఉన్న విదేశీ ఆటగాడు అనీశ్ గిరి (నెదర్లాండ్స్) కూడా నిష్క్ర మించాడు. రష్యాకు చెందిన అలెగ్జాండర్ డాన్‌చెన్‌కో 47 ఎత్తుల్లో అనీశ్‌ను చిత్తు చేశాడు. తమ మూడో రౌండ్‌లో తొలి గేమ్‌లను డ్రాలుగా ముగించిన విదిత్ గుజరాతీ, కార్తీక్ వెంకటరామన్, జీఎం నారాయణన్ ఆదివారం టైబ్రేక్ రౌండ్ ఆడతారు.


