విజయ్ హజారే వన్డే ట్రోఫీ 2025-26లో తొలి రోజే అద్భుతాలు జరిగాయి. ఇవాళ ఒక్క రోజు లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో టాప్-8లోని మూడు ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదయ్యాయి. బిహార్ ఆటగాడు సకీబుల్ గనీ 32 బంతుల్లో శతక్కొట్టి, లిస్ట్-ఏలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా అవతరించగా.. ఝార్ఖండ్ ఆటగాడు ఇషాన్ కిషన్ 33 బంతుల్లో, వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో సెంచరీలు పూర్తి చేసి లిస్ట్-ఏ క్రికెట్‌లో నాలుగు, ఎనిమిదో ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా రికార్డుల్లోకెక్కారు.
వీరు మాత్రమే కాక ఇవాళే మరో ముగ్గురు స్టార్ బ్యాటర్లు కూడా సెంచరీలు చేశారు. టీమిండియా వెటరన్ స్టార్లు రోహిత్ శర్మ (ముంబై), విరాట్ కోహ్లి (ఢిల్లీ).. అప్‌కమింగ్ స్టార్ దేవ్‌దత్ పడిక్కల్ (కర్ణాటక) శతక్కొట్టుడు కొట్టారు. ఇవాళే ఓ అనామక ఆటగాడు డబుల్ సెంచరీ కూడా చేశాడు. ఒడిషాకు చెందిన స్వస్తిక్ సమల్ సౌరాష్ట్రపై ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా విజయ్ హజారే ట్రోఫీ 2025-25 ఎడిషన్ తొలి రోజు శతకాల మోత (22) మోగింది.
పడిక్కల్ వీరోచిత పోరాటం.. ఇషాన్ కిషన్ 33 బంతుల శతకం వృధా
ఇదిలా ఉంటే, ఇవాళ కర్ణాటకపై ఇషాన్ కిషన్ చేసిన 33 బంతుల శతకం వృధా అయ్యింది. ఇషాన్ కిషన్ శతక్కొట్టుడు కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఝార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో 412 పరుగుల అతి భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. దేవదత్ పడిక్కల్ వీరోచితంగా పోరాడి కర్ణాటకకు చారిత్రక విజయాన్ని అందించాడు.
భారీ లక్ష్య ఛేదనలో పడిక్కల్ 118 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 147 పరుగులు చేసి కర్ణాటకను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. ఆతర్వాత అభినవ్ మనోహర్ (56 నాటౌట్), ధృవ్ ప్రభాకర్ (40 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి కర్ణాటకను గెలుపు తీరాలు దాటించారు.
లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఇది రెండో భారీ లక్ష్య ఛేదనగా.. విజయ్ హజారే టోర్నీ చరిత్రలో భారీ లక్ష్య ఛేదనగా రికార్డైంది. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అతి భారీ లక్ష్య ఛేదన రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. 2006లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా 435 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించింది.


