విజయ్ హజారే ట్రోఫీ (VHT).. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 50 ఓవర్ల దేశవాలీ టోర్నీ. ఈ టోర్నీని అంతర్జాతీయ వన్డేలతో కలిపి లిస్ట్-ఏ ఫార్మాట్‌గా పరిగణిస్తారు. 1993–94లో జోనల్ స్థాయిలో ప్రారంభమైన ఈ టోర్నీ.. 2002–03 నుంచి అన్ని రాష్ట్ర జట్లు పాల్గొనేలా జాతీయ స్థాయికి విస్తరించింది.
తొలినాళ్లలో ఈ టోర్నీని రంజీ వన్డే ట్రోఫీగా పిలిచే వారు. 2004లో భారత క్రికెట్ దిగ్గజం విజయ్ హజారే మరణం తర్వాత విజయ్ హజారే ట్రోఫీగా నామకరణం చేశాడు. 2007-08 ఎడిషన్ నుంచి ఇదే పేరుతో ఈ టోర్నీ కొనసాగుతుంది.
ప్రస్తుతం ఈ టోర్నీలో 38 రాష్ట్ర జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్, నాకౌట్ పద్దతిలో జరిగే ఈ టోర్నీలో కర్ణాటక, తమిళనాడు అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్నాయి. ఈ రెండు జట్లు చెరో 5 టైటిళ్లు సాధించాయి. ఈ టోర్నీ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి అనేక మంది స్టార్ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చింది.
ఇవాల్టి నుంచి (డిసెంబర్ 24) 2025-26 ఎడిషన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ టోర్నీలో అత్యుత్తమ రికార్డులు, విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మహారాష్ట్రకు చెందిన అంకిత్ బావ్నే (4010 పరుగులు) కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో అత్యధిక సెంచరీల రికార్డు (15) కూడా బావ్నే పేరిటే ఉంది. అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు ఇషాన్ కిషన్ (273) ఖాతాలో ఉంది.
ఫాస్టెస్ట్ సెంచరీ ఇవాళే (బిహార్ ఆటగాడు సకీబుల్ గనీ-32 బంతుల్లో) నమోదైంది. టోర్నీ చరిత్రలో యంగెస్ట్ సెంచూరియన్ రికార్డు కూడా ఇవాళే నమోదైంది. బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల వయసులో ఈ రికార్డు సాధించాడు. ఈ సెంచరీ లిస్ట్-ఏ చరిత్రలో ఎనిమిదో వేగవంతమైన శతకంగానూ (36 బంతుల్లో) రికార్డైంది.
ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా సిద్ధార్థ్ కౌల్ (155 వికెట్లు, పంజాబ్) ఉన్నాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు షాబాజ్ నదీమ్ (జార్ఖండ్, 8/10) పేరిట ఉన్నాయి. ఓ సింగిల్ సీజన్‌లో అత్యధిక వికెట్ల రికార్డు జయదేవ్ ఉనద్కత్ (2012–13 ఎడిషన్‌లో 19 వికెట్లు) పేరిట ఉంది.
జట్టు రికార్డుల విషయానికొస్తే.. అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు కూడా ఇదే సీజన్‌లో నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బిహార్ రికార్డు స్థాయిలో 574 పరుగులు చేసింది. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ స్కోర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అత్యల్ప స్కోర్ అస్సాం (36 పరుగులు vs ముంబై, 2012) పేరిట ఉంది.
ఈ టోర్నీ విరాట్ కోహ్లి (2006-07 సీజన్‌లో), రోహిత్ శర్మ (2005-06 సీజన్‌లో) లాంటి దిగ్గజాలను వెలుగులోకి తేవడంతో పాటు రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, అభిషేక్ శర్మ, రజత్ పాటిదార్, శుభ్‌మన్ గిల్ లాంటి టీమిండియా స్టార్లకు తమ సత్తా చాటేందుకు వేదికగా ఉపయోగపడింది.


