ప్రపంచ కప్ తొలి పోరులో భారత్ విజయం
29 పరుగులతో ఓడిన అమెరికా
సూర్యకుమార్ మెరుపు ఇన్నింగ్స్
బౌలర్ల సమష్టి ప్రదర్శన
గురువారం నమీబియాతో టీమిండియా మ్యాచ్
అభిషేక్ శర్మ డకౌట్... పవర్‌ప్లే ముగిసేసరికి 46/4... ఒకదశలో వరుసగా 26 బంతుల పాటు బౌండరీనే రాలేదు... 12.4 ఓవర్లు ముగిసేసరికి 77/6... పరిస్థితి చూస్తే అమెరికా సంచలన విజయానికి పునాది వేసుకున్నట్లు అనిపించింది. కానీ సూర్యకుమార్ అసలు సమయంలో తన స్థాయిని ప్రదర్శించాడు. ఒంటి చేత్తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును మెరుగైన స్థితికి చేర్చాడు. మిగిలిన 44 బంతుల్లో భారత్ మరో 84 పరుగులు జోడిస్తే వీటిలో సూర్య ఒక్కడే 7 ఫోర్లు, 4 సిక్స్‌లు సహా 63 పరుగులు సాధించాడు.
ఛేదనలో ఆరంభం నుంచే తడబడిన అమెరికా ఆతిథ్య జట్టు సవాల్ ముందు నిలవలేకపోయింది. భారత బౌలర్లు సిరాజ్, అర్ష్ దీప్, అక్షర్ పటేల్ సమష్టిగా రాణించడంతో లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. బలహీన జట్టుతో మ్యాచ్‌లో చివరకు గట్టెక్కినా... ఈ మ్యాచ్ భారత బ్యాటింగ్‌కు చిన్న హెచ్చరికను జారీ చేసింది.
ముంబై: టి20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ శుభారంభం చేసింది. చిన్న జట్టు చేతిలో కాస్త పోటీ ఎదురైనా చివరకు పైచేయి సాధించింది. శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ పోరులో భారత్ 29 పరుగుల తేడాతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ)పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
సహచరులంతా విఫలమైనా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడి జట్టుకు మెరుగైన స్కోరును అందించారు. అమెరికా బౌలర్లలో వాన్ షాక్‌విక్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులకే పరిమితమైంది. శుభమ్ రంజనే (22 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజయ్ కృష్ణమూర్తి (31 బంతుల్లో 37; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మిలింద్ కుమార్ (34 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు.
సిరాజ్ 3 వికెట్లు పడగొట్టగా... అర్ష్ దీప్, అక్షర్ చెరో 2 వికెట్లు తీశారు. అనారోగ్యం కారణంగా భారత టాప్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ బరిలోకి దిగలేదు. భారత్ తమ తర్వాతి పోరులో గురువారం న్యూఢిల్లీలో నమీబియాతో తలపడుతుంది.
సూర్యకుమార్‌కు లైఫ్...
హిట్టర్ అభిషేక్ శర్మ (0) తాను ఆడిన తొలి బంతికే అనూహ్యంగా ‘డకౌట్’ కాగా... ఇషాన్ కిషన్ (16 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. నేత్రావల్కర్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో తిలక్ ధాటిని ప్రదర్శించగా, అలీఖాన్ ఓవర్లో ఇషాన్ వరుసగా 4, 6 కొట్టాడు. అయితే షాల్‌విక్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఒక్కసారిగా ఆట మలుపు తిరిగింది. రెండో బంతికి ఇషాన్ కిషన్ వెనుదిరగ్గా, ఓవర్లోని చివరి రెండు బంతుల్లో వరుసగా తిలక్, శివమ్ దూబే (0) అవుటయ్యారు.
పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 49/4 వద్ద నిలిచింది. లెగ్‌స్పిన్నర్ మొహసిన్ బౌలింగ్‌లో వరుసగా ఏడు బంతుల పాటు సింగిల్ కూడా తీయలేకపోయిన రింకూ సింగ్ (6) అసహనంతో తర్వాతి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ కాగా, హార్దిక్ పాండ్యా (5) కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఇలాంటి స్థితిలో సూర్యకుమార్ బాధ్యత తీసుకున్నాడు. 15 పరుగుల వద్ద శుభమ్ తన బౌలింగ్‌లోనే సూర్య ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో విఫలం కావడంతో భారత కెప్టెన్ కు లైఫ్ లభించింది.
దీనిని అతను సమర్థంగా వాడుకుంటూ చకచకా పరుగులు రాబట్టాడు. నేత్రావల్కర్ ఓవర్లో సూర్య, అక్షర్ పటేల్ (11 బంతుల్లో 14; 2 ఫోర్లు) కలిసి 3 ఫోర్లు, సిక్స్‌తో మొత్తం 21 పరుగులు రాబట్టారు. 36 బంతుల్లో సూర్య అర్ధసెంచరీ పూర్తయింది. నేత్రావల్కర్ వేసిన ఆఖరి ఓవర్లో సూర్య వరుస బంతుల్లో 4, 6, 6, 4 బాది ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించాడు.
సిరాజ్‌కు 3 వికెట్లు..
ఛేదనలో అమెరికాకు సరైన ఆరంభం లభించలేదు. తొలి 20 బంతుల్లో 5 పరుగుల వ్యవధిలో జట్టు 3 వికెట్లు కోల్పోయింది. సిరాజ్ వరుస ఓవర్లలో గూస్ (6), సాయితేజ ముక్కామల (2)లను వెనక్కి పంపగా, మోనాంక్ పటేల్ (0) వికెట్ అర్ష్ దీప్ ఖాతాలో చేరింది. ఈ దశలో మిలింద్, కృష్ణమూర్తి కలిసి కొన్ని చక్కటి షాట్లతో ఆదుకునే ప్రయత్నం చేశారు.
వీరిద్దరు నాలుగో వికెట్‌కు 52 బంతుల్లో 58 పరుగులు జోడించారు. అయితే మిలింద్‌ను అవుట్ చేసి వరుణ్ ఈ జోడీని విడగొట్టగా... 29 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన స్థితిలో అక్షర్ వరుస బంతుల్లో కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్ (0)లను అవుట్ చేశాడు. దాంతో అమెరికా గెలుపు ఆశలు కోల్పోయింది. చివర్లో శుభమ్ కొంత పోరాడినా లాభం లేకపోయింది. 2024 జూలైలో భారత్ తరఫున చివరి టి20 ఆడి జట్టుకు దూరమైన సిరాజ్... అనూహ్యంగా వరల్డ్ కప్ అవకాశం దక్కించుకొని తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లతో సత్తా చాటాడు.

సొంతగడ్డపై ముగ్గురు ముంబైకర్లు...
అమెరికా జట్టులో సభ్యులైన సౌరభ్ నేత్రావల్కర్, శుభమ్ రంజనే, హర్మీత్ సింగ్‌లకు ముంబైతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ముగ్గురూ ముంబైలోనే ఓనమాలు నేర్చుకొని ఇక్కడే కెరీర్‌ను మలచుకున్నారు. ముగ్గురు కూడా జూనియర్, అండర్–19 క్రికెట్‌ను ముంబై తరఫునే ఆడటంతో పాటు రంజీ ట్రోఫీలో కూడా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

రంజనే చివరి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడినప్పుడు జట్టు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. తర్వాతి రోజుల్లో యూఎస్‌కు వలస వెళ్లి వీరు అక్కడి జాతీయ జట్టులో కీలక సభ్యులుగా ఎదిగారు. అయితే వాంఖెడే మైదాలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ అయినా ఆడాలనేది వీరి చిరకాల కోరిక! అది ఈ మ్యాచ్‌తో నెరవేరింది. మ్యాచ్‌లో ముగ్గురూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వకపోయినా... సొంతగడ్డపై వరల్డ్ కప్ ఆడిన జ్ఞాపకం వారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) మిలింద్ (బి) షాల్‌విక్ 20; అభిషేక్ (సి) కృష్ణమూర్తి (బి) అలీ ఖాన్ 0; తిలక్ వర్మ (సి) మోనాంక్ (బి) షాల్‌విక్ 25; సూర్యకుమార్ (నాటౌట్) 84; దూబే (సి) నేత్రావల్కర్ (బి) షాల్‌విక్ 0; రింకూ (సి) మిలింద్ (బి) మొహసిన్ 6; పాండ్యా (సి) ముక్కామల (బి) హర్మీత్ 5; అక్షర్ (సి) మొహసిన్ (బి) హర్మీత్ 14; అర్ష్ దీప్ (సి) మిలింద్ (బి) షాల్‌విక్ 4; వరుణ్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–8, 2–45, 3–46, 4–46, 5–72, 6–77, 7–118, 8–140, 9–161. బౌలింగ్: సౌరభ్ నేత్రావల్కర్ 4–0–65–0, అలీ ఖాన్ 2–0–13–1, షాల్‌విక్ 4–0–25–4, మొహసిన్ 4–0–16–1, శుభమ్ 2–0–16–0, హర్మీత్ 4–0–26–2.
అమెరికా ఇన్నింగ్స్: గూస్ (సి) తిలక్ (బి) సిరాజ్ 6; సాయితేజ ముక్కామల (సి) వరుణ్ (బి) సిరాజ్ 2; మోనాంక్ (సి) దూబే (బి) అర్ష్ దీప్ 0; మిలింద్ (స్టంప్డ్) ఇషాన్ కిషన్ (బి) వరుణ్ 34; కృష్ణమూర్తి (సి) రింకూ (బి) అక్షర్ 37; శుభమ్ (ఎల్బీ) (బి) సిరాజ్ 37; హర్మీత్ (సి) సిరాజ్ (బి) అక్షర్ 0; మొహసిన్ (సి) తిలక్ (బి) అర్ష్ దీప్ 8; షాల్‌విక్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–8, 2–11, 3–13, 4–71, 5–98, 6–98, 7–110, 8–132. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–18–2, సిరాజ్ 4–0–29–3, వరుణ్ 4–0–24–1, అక్షర్ 4–0–24–2, పాండ్యా 4–0–34–0.
టి20 ప్రపంచకప్‌లో నేడు
న్యూజిలాండ్ X అఫ్గానిస్తాన్
వేదిక: చెన్నై; ఉదయం 11 గంటల నుంచి
ఇంగ్లండ్X నేపాల్
వేదిక: ముంబై; మధ్యాహ్నం 3 గంటల నుంచి
శ్రీలంక X ఐర్లాండ్
వేదిక: కొలంబో; రాత్రి 7 గంటల నుంచి
స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం


