
నేటి నుంచి సింక్‌ఫీల్డ్ కప్ చెస్ టోర్నీ
బరిలో ప్రజ్ఞానంద
సెయింట్ లూయిస్ (అమెరికా): ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తిరిగి క్లాసికల్ చెస్ పోటీల్లో తలపడేందుకు సిద్ధమయ్యాడు. గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా ఐదో టోర్నీ అయిన సింక్‌ఫీల్డ్ కప్‌లో భారత్ తరఫున గుకేశ్‌తోపాటు ప్రజ్ఞానంద విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. పదిమంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతుంది. సోమవారం నుంచి ఇక్కడ జరిగే ఈ టోర్నీలో అమెరికా గ్రాండ్‌మాస్టర్లు ఫాబియానో కరువానా, వెస్లీ సో, లెవోన్ అరోనియన్, స్యామ్ సేవియన్‌లతో పాటు ఫ్రాన్స్‌కు చెందిన మాక్సిమి వాచియెర్ లాగ్రెవ్, అలీరెజా ఫిరూజా... పోలాండ్ స్టార్ జాన్ క్రిస్టోఫ్ డూడా... ఉజ్బెకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్ కూడా పాల్గొంటున్నారు.
అయితే ప్రపంచ నంబర్‌వన్, మాజీ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ ఆడకపోవడమే టోర్నీకి ప్రధాన లోటు అని చెప్పొచ్చు. ఈ నార్వే గ్రాండ్‌మాస్టర్ క్లాసికల్ చెస్‌ను ఆస్వాదించలేకపోతున్నానని ఇదివరకే ఎన్నోసార్లు స్పష్టం చేశాడు. అందువల్లే ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. అయితే చెస్ దిగ్గజం కార్ల్‌సన్ లేకపోయినప్పటికీ భారత ఆటగాళ్లకు ప్రధానంగా అమెరికా ఆటగాళ్లు ఆరోనియన్, కరువానా, అలీరెజా నుంచి గట్టిపోటీ తప్పదు. సెయింట్ లూయిస్‌లోనే జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో గుకేశ్ ఆశించినంతగా రాణించలేకపోయాడు.
అయితే తనకు పట్టున్న క్లాసికల్ ఫార్మాట్‌లో సత్తా చాటుకోవడానికి గుకేశ్ రెడీగా ఉన్నాడు. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 3,50,000 డాలర్లు (రూ. 3 కోట్ల 6 లక్షలు). విజేతకు 1,00,000 డాలర్లు (రూ.87 లక్షల 51 వేలు) అందజేస్తారు. రన్నరప్‌గా నిలిచిన ప్లేయర్‌కు 65 వేల డాలర్లు (రూ. 56 లక్షల 88 వేలు), మూడో స్థానం పొందిన ప్లేయర్‌కు 48 వేల డాలర్లు (రూ. 42 లక్షలు) లభిస్తాయి.