రెండో గేమ్ కూడా ‘డ్రా’
ఎసిపెంకోకు మూడో స్థాన
క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత
పనాజీ: పురుషుల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ కొత్త విజేత ఎవరో నేడు తేలనుంది. సిందరోవ్ జవోఖిర్ (ఉజ్బెకిస్తాన్), వె యి (చైనా) మధ్య ఫైనల్ మ్యాచ్‌లోని నిరీ్ణత రెండు క్లాసిక్ గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. దాంతో ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. ఫలితంగా వీరిద్దరి మధ్య నేడు టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. సిందరోవ్, వె యి మధ్య మంగళవారం జరిగిన రెండో గేమ్ 30 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. అంతకుముందు భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహా్వల్ ముఖ్య అతిథిగా విచ్చేసి రెండో గేమ్‌ను ప్రారంభించింది.
టైబ్రేక్ జరిగేది ఇలా...
సిందరోవ్, వె యి మధ్య నేడు ముందుగా 15 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లు నిర్వహిస్తారు. ఇందులో ఫలితం తేలకపోతే 10 నిమిషాల నిడివిగల మరో రెండు గేమ్‌లను ఆడిస్తారు. ఇక్కడా ఫలితం రాకపోతే 5 నిమిషాల నిడివిగల మరో రెండు గేమ్‌లను నిర్వహిస్తారు. అయినా విజేత తేలకపోతే 3 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లను ఆడిస్తారు. ఇక్కడా స్కోరు సమమైతే ఇద్దరి మధ్య ‘సడన్ డెత్’ గేమ్ నిర్వహిస్తారు. ఒకవేళ ‘సడెన్ డెత్’ గేమ్ కూడా ‘డ్రా’ అయితే నల్లపావులతో ఆడిన ప్లేయర్‌ను విజేతగా ప్రకటిస్తారు.
మరోవైపు రష్యా గ్రాండ్‌మాస్టర్ ఆండ్రీ ఎసిపెంకో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నొదిర్‌బెక్ యాకుబొయేవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన పోటీలో ఎసిపెంకో 2–0తో గెలిచి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత సాధించాడు. నొదిర్‌బెక్‌తో సోమవారం జరిగిన తొలి గేమ్‌లో 38 ఎత్తుల్లో గెలిచిన ఎసిపెంకో... మంగళవారం జరిగిన రెండో గేమ్‌లో 26 ఎత్తుల్లో విజయం సాధించాడు.


