పనాజీ: ప్రపంచకప్ పురుషుల చెస్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా ర్వితిక్... ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎంఆర్ లలిత్ బాబులకు నిరాశ ఎదురైంది. ఈ ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లు తీవ్రంగా పోరాడినా... తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయారు. నొగెర్‌బెక్ కాజీబెక్ (కజకిస్తాన్)తో జరిగిన తొలి రౌండ్‌లో రాజా ర్వితిక్ ‘టైబ్రేక్’లో 2–4తో... మాక్స్ వార్మెర్‌డామ్ (నెదర్లాండ్స్)తో జరిగిన తొలి రౌండ్‌లో లలిత్ బాబు ‘టైబ్రేక్’లో 2–4తో ఓడిపోయారు. ఆదివారం నిరీ్ణత రెండు క్లాసికల్ గేమ్‌ల తర్వాత 1–1తో సమంగా ఉండటంతో... విజేతను నిర్ణయించేందుకు సోమవారం ‘టైబ్రేక్’ గేమ్‌లు ఆడించారు. నిబంధనల ప్రకారం ముందుగా 15 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లు నిర్వహించారు.
నొగెర్‌బెక్‌తో జరిగిన తొలి గేమ్‌లో రాజా ర్వితిక్ 42 ఎత్తుల్లో ఓడిపోయాడు. అయితే రెండో గేమ్‌లో ర్వితిక్ 52 ఎత్తుల్లో గెలిచాడు. దాంతో టైబ్రేక్‌లో స్కోరు 1–1తో సమమైంది. దాంతో ఫలితం తేలేందుకు ఈసారి 10 నిమిషాల నిడివిగల మరో రెండు గేమ్‌లు ఆడించారు. తొలి గేమ్‌లో నొగెర్‌బెక్ 43 ఎత్తుల్లో గెలిచి 2–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ రెండో గేమ్‌లో ర్వితిక్ 42 ఎత్తుల్లో గెలవడంతో స్కోరు 2–2తో సమమైంది. దాంతో ఈసారి 5 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లు ఆడించారు. తొలి గేమ్‌లో ర్వితిక్ 71 ఎత్తుల్లో ఓడిపోయాడు.
బరిలో నిలవాలంటే రెండో గేమ్‌లో ర్వితిక్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రెండో గేమ్‌లో ర్వితిక్ 65 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. దాంతో నొగెర్‌బెక్ టైబ్రేక్‌లో 4–2తో విజయాన్ని అందుకొని రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. మరోవైపు వార్మెర్‌డామ్‌తో జరిగిన 15 నిమిషాల నిడివిగల టైబ్రేక్ తొలి గేమ్‌లో లలిత్‌బాబు 30 ఎత్తుల్లో నెగ్గాడు. రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నా లలిత్ బాబు ముందంజ వేసేవాడు. కానీ రెండో గేమ్‌లో వార్మెర్‌డామ్ 40 ఎత్తుల్లో గెలిచి స్కోరును 1–1తో సమం చేశాడు.
ఇక 10 నిమిషాల నిడివిగల తొలి గేమ్‌లో వార్మెర్‌డామ్ 46 ఎత్తుల్లో నెగ్గి 2–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే రెండో గేమ్‌లో లలిత్ బాబు 50 ఎత్తుల్లో గెలిచి స్కోరును 2–2తో సమం చేశాడు. ఇక 5 నిమిషాల నిడివిగల తొలి గేమ్‌లో వార్మెర్‌డామ్ 47 ఎత్తుల్లో విజయం సాధించి 3–2తో ఆధిక్యాన్ని సంపాదించాడు. బరిలో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన రెండో గేమ్‌లో లలిత్ బాబు 61 ఎత్తుల్లో ఓడిపోయాడు. దాంతో వార్మెర్‌డామ్ 4–2తో గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు ఎస్‌ఎల్ నారాయణన్, దీప్తాయాన్ ఘోష్ టైబ్రేక్ ర్యాపిడ్ గేముల్లో తమ ప్రత్యర్థులను ఓడించి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.


