ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ (D Gukesh)పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ఆటలోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ చాంపియన్‌వే’’ అంటూ కొనియాడుతున్నారు. పద్దెమినిదేళ్ల వయసులోనే ఇంత పరిణతి సాధించిన గుకేశ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికాలోని సెయింట్ లూసియాలో జరుగుతున్న క్లచ్ చెస్ చాంపియన్స్ షోడౌన్-2025 ఈవెంట్లో గుకేశ్.. అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ హికారు నకమురా (Hikaru Nakamura)ను ఓడించాడు. ఆది నుంచే ఆత్మవిశ్వాసంతో పావులు కదిపిన ఈ చెన్నై చిన్నోడు 1.5- 0.5 తేడాతో నకమురాను ఓడించాడు.
గుకేశ్ ‘కింగ్’ను ప్రేక్షకుల వైపు విసిరిన నకమురా
ఈ క్రమంలో గెలుపొందిన తర్వాత గుకేశ్ హుందాగా ప్రవర్తించిన తీరే అతడిపై ప్రశంసలకు కారణం. కాగా అక్టోబరు 6న ఆర్లింగ్టన్‌లో జరిగిన చెక్‌మేట్ ఈవెంట్ ఓపెనింగ్ లెగ్‌లోనూ గుకేశ్- నకమురా ముఖాముఖి తలపడ్డారు. ఈ గేమ్‌లో నకమురా గుకేశ్‌ను 5-0తో వైట్‌వాష్ చేశాడు.
దీంతో భారత్‌పై అమెరికా విజయం ఖరారు కాగా.. నకమురా.. గుకేశ్ ‘కింగ్’ను ప్రేక్షకుల వైపు విసిరి సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే, గుకేశ్ మాత్రం సహనం కోల్పోకుండా.. సంయమనం పాటిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోయాడు.
ఇంతకంటే గొప్పగా ‘ప్రతీకారం’ తీర్చుకోవచ్చా?
ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. అయితే, ఈసారి గుకేశ్ విజేతగా నిలిచాడు. అయినాసరే అప్పుడు 37 ఏళ్ల నకమురా చేసినట్లుగా ఓవరాక్షన్ చేయలేదు. నకమురా షేక్‌హ్యాండ్ ఇవ్వగా హుందాగా స్వీకరించిన గుకేశ్.. తర్వాత తనదైన శైలిలో పావులను బోర్డుపై అమరుస్తూ ఉండిపోయాడు.
Revenge Is A Dish Best Served Cold 🥶 pic.twitter.com/icCvA1JA4u
— Desidudewithsign (@Nikhilsingh21_) October 28, 2025
ఈ రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ.. నెటిజన్లు గుకేశ్‌ను ప్రశంసిస్తున్నారు. ‘‘ప్రతీకారం కంటే.. ఇలా చిన్న చిరునవ్వుతోనే ప్రత్యర్థిని మరింత గొప్పగా దెబ్బకొట్టవచ్చు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చిన్న వయసులోనే చదరంగ రారాజుగా
కాగా గతేడాది డిసెంబరులో గుకేశ్ ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. సింగపూర్ సిటీ వేదికగా జరిగిన క్లాసికల్ ఫార్మాట్లో చైనా గ్రాండ్‌మాస్టర్, డిఫెండింగ్ చాంపియన్ డాంగ్ లిరెన్‌ను ఓడించడం ద్వారా గుకేశ్ విజేతగా నిలిచాడు.
పద్దెమినిదేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించి.. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన రెండో భారత క్రీడాకారుడిగా నిలిచాడు. ఈ క్రమంలో దాదాపు రూ. 11.45 కోట్ల ప్రైజ్‌మనీని గుకేశ్ అందుకున్నాడు.
చదవండి: PKL 2025: తెలుగు టైటాన్స్‌కు చావో రేవో మ్యాచ్.. ఓడితే పరిస్థితి ఏంటి?


