దుర్గాపూర్: జాతీయ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో తమిళనాడుకు చెందిన పీవీ నందిత విజేతగా నిలిచింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత నందిత 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తొమ్మిది గేముల్లో గెలిచిన నందిత, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయింది. చాంపియన్‌గా నిలిచిన నందితకు విన్నర్స్ ట్రోఫీతో పాటు రూ. 7 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.
పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు చెందిన మేరీ ఆన్ గోమ్స్ 9 పాయింట్లతో రన్నరప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. త్రిపుర అమ్మాయి అర్షియా దాస్ 8.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. శుభి గుప్తా (ఉత్తరప్రదేశ్), కల్యాణి సిరిన్ (కేరళ), సృష్టి పాండే (మహారాష్ట్ర), వర్షిణి (తమిళనాడు), సాచి జైన్ (ఢిల్లీ), ఏజీ నిమ్మీ (కేరళ) 8 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచారు.
మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా వీరి ర్యాంకింగ్‌ను వర్గీకరించగా వరుసగా 4 నుంచి 9 స్థానాల్లో నిలిచారు. తెలంగాణ అమ్మాయి వేల్పుల సరయు 7.5 పాయింట్లతో 11వ ర్యాంక్‌ను దక్కించుకుంది. సరయు ఏడు గేముల్లో గెలిచి, మూడు గేముల్లో ఓడిపోయి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది.
తెలంగాణకు చెందిన శివంశిక 7 పాయింట్లతో 21వ స్థానంలో, గాదె శరణ్య 6.5 పాయింట్లతో 33వ స్థానంలో, స్నేహ భరతకోటి 6.5 పాయింట్లతో 37వ స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొట్లూరి సుప్రీత 7.5 పాయింట్లతో 14వ స్థానంలో, భీమరశెట్టి శ్రావ్యశ్రీ 7 పాయింట్లతో 18వ స్థానంలో, మోడిపల్లి దీక్షిత 7 పాయింట్లతో 24వ స్థానంలో నిలిచారు. పాయింట్లు సమంగా ఉన్నపుడు మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు.


