టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్‌గా యువరాజ్ సింగ్‌కు పేరుంది. టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 టోర్నీల్లో భారత్ చాంపియన్‌గా నిలవడంలో అతడిది కీలక పాత్ర. పదిహేడేళ్లకుపైగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన యువీ.. తన కెరీర్‌లో 40 టెస్టులు, 58 టీ20 మ్యాచ్‌లు.. అత్యధికంగా 304 వన్డేలు ఆడాడు.
టెస్టుల్లో 1900, టీ20లలో 1177 పరుగులు చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వన్డేల్లో 14 శతకాల సాయంతో 8701 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖాతాలో 9 టెస్టు, 111 వన్డే, 28 టీ20 వికెట్లు ఉన్నాయి. ఐపీఎల్‌లోనూ 132 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 2750 పరుగులు చేయడంతో పాటు.. 36 వికెట్లు కూడా తీశాడు.
ఇంతటి అనుభవం గల యువీ దగ్గర పంజాబీ బ్యాటర్లు, టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ శిక్షణ తీసుకున్నారు. అతడి మార్గదర్శనంలో వీరిద్దరు రాటుదేలారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా, ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా ఎదగడంలో యువీది కీలక పాత్ర.
మరోవైపు.. గిల్ ఏకంగా టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. ఇక యువీ శిష్యుల జాబితాలోకి తాజాగా సంజూ శాంసన్ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్‌కు ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సన్నద్ధమవుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సన్నాహకంగా సాగే ఈ సిరీస్‌లో సత్తా చాటి.. మెగా ఈవెంట్లోనూ మెరవాలని సంజూ పట్టుదలగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ మార్గదర్శనంలో నెట్స్‌లో సంజూ శ్రమిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో యువీ.. సంజూకు బ్యాటింగ్ పొజిషన్, టెక్నిక్స్ గురించి సలహాలు ఇస్తుండగా.. అతడు శ్రద్ధగా వింటున్నట్లు కనిపించిది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘క్రేజీ కాంబినేషన్.. సూపర్ భయ్యా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సంజూ శాంసన్ ఫ్యాన్స్ పేజీ నుంచి వచ్చిన ఈ వీడియోపై మరికొందరు మాత్రం.. ‘‘AI’’ కాదు కదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా న్యూజిలాండ్‌తో తొలుత మూడు వన్డేలు ఆడిన తర్వాత.. టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 11- 31 వరకు ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఆ తర్వాత ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్-2026తో భారత జట్టు బిజీ అవుతుంది.
Sanju Samson training session with Yuvraj Singh ❤️🔥@YUVSTRONG12 @IamSanjuSamson pic.twitter.com/gBc04dbKXs
— Sanju Samson Fans Page (@SanjuSamsonFP) January 10, 2026


