చెన్నై: నెల రోజుల వ్యవధిలో రెండు టోర్నీల్లో టైటిల్ సాధించి, మరో టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద భారత నంబర్‌వన్ చెస్ ప్లేయర్‌గా అవతరించాడు. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20 ఏళ్ల ప్రజ్ఞానంద నాలుగు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్ నుంచి 8వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇటీవల సెయింట్ లూయిస్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నీలో టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద... సింక్‌ఫీల్డ్ కప్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. ఆ తర్వాత గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ టోర్నీలో అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం ప్రజ్ఞానంద వద్ద 2761 ఎలో రేటింగ్ పాయింట్లున్నాయి. గత రెండు నెలలుగా తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచి భారత నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ భారత రెండో ర్యాంకర్‌గా మారిపోయాడు. తొమ్మిదో ర్యాంక్‌లో కొనసాగుతున్న అర్జున్ వద్ద 2759 ఎలో రేటింగ్ పాయింట్లున్నాయి. భారత ఇతర గ్రాండ్‌మాస్టర్లు విశ్వనాథన్ ఆనంద్ 14వ ర్యాంక్‌లో, నిహాల్ సరీన్ 25వ ర్యాంక్‌లో, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ 32వ ర్యాంక్‌లో, విదిత్ 33వ ర్యాంక్‌లో ఉన్నారు.
నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్ 2823 ఎలో రేటింగ్ పాయింట్లతో ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. 2011 జూలై నుంచి కార్ల్‌సన్ ర్యాంక్‌లో మార్పులేదు. ర్యాపిడ్ ఫార్మాట్‌లో ఇరిగేశి అర్జున్ ప్రపంచ మూడో ర్యాంక్‌లో, ప్రజ్ఞానంద ఏడో ర్యాంక్‌లో... బ్లిట్జ్ ఫార్మాట్‌లో అర్జున్ ప్రపంచ ఆరో ర్యాంక్‌లో, నిహాల్ సరీన్ 15వ ర్యాంక్‌లో ఉన్నారు. ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్‌లలోనూ కార్ల్‌సన్ ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు.


