సెంచరీతో చెలరేగిన భారత బ్యాటర్
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 503/9 డిక్లేర్డ్
శ్రీలంక తడబాటు ప్రస్తుతం 8/2
కొలంబో: శ్రీలంకతో సిరీస్‌కు ముందు వరుసగా విఫలమవుతూ ఒత్తిడిని ఎదుర్కొన్న ధ్రువ్ జురేల్ ఇప్పుడు ఆరో స్థానంలో బ్యాటర్‌గా తన సమర్థతను చూపించాడు. తొలి టెస్టులో అర్ధ సెంచరీతో రాణించిన అతను ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ శతకంతో కదం తొక్కాడు. అతనికి రిషభ్ పంత్ మెరుపులు తోడవడంతో భారీ స్కోరు నమోదు చేసిన భారత్... 11 బంతుల వ్యవధిలో 2 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ కొట్టింది. రెండో రోజు వెలుతురులేమితో ఆట నిలిపివేసే సమయానికి శ్రీలంక 3 ఓవర్లలో 2 వికెట్లకు 8 పరుగులు చేసింది.
మ్యాచ్‌కు రెండో రోజు వర్షం పదే పదే అంతరాయం కలిగించడంతో మొత్తం 56 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 300/5తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 138 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ధ్రువ్ జురేల్ (177 బంతుల్లో 115 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్‌లో రెండో టెస్టు సెంచరీ సాధించగా, రిషభ్ పంత్ (89 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 112 పరుగులు జోడించారు. లంక పేసర్ అసిత ఫెర్నాండోకు 4 వికెట్లు దక్కాయి.
పంత్ హాఫ్ సెంచరీ...
సోమవారం ఆట మొదలయ్యాక రెండో ఓవర్లోనే సారాంశ్ జైన్ (6) వెనుదిరిగాడు. ముందు రోజు మణికట్టు గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన పంత్ మళ్లీ బరిలోకి దిగి జురేల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. చక్కటి సమన్వయంతో ఆడుతూ పరుగులు రాబట్టిన వీరిద్దరిని నిలువరించడంలో లంక బౌలర్లు విఫలమయ్యారు. ఈ క్రమంలో తనదైన శైలిలో దూకుడుగా ఆడిన పంత్ ముందుగా 81 బంతుల్లో, తర్వాతి ఓవర్లో జురేల్ 97 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు.
అయితే లంచ్ తర్వాత తొలి బంతికే పంత్ అవుట్ కాగా, మానవ్ సుతార్ (18) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో జాగ్రత్తగా ఆడుతూ జురేల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వానతో సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఆట మళ్లీ మొదలయ్యాక ఫెర్నాండో బౌలింగ్‌లో మిడాఫ్ దిశగా సింగిల్ తీయడంతో 171 బంతుల్లో జురేల్ శతకం పూర్తయింది. మరో ఎండ్‌లో సిరాజ్ (3) అవుట్ కాగా, స్కోరు 500 దాటిన తర్వాత భారత్ డిక్లేర్ చేసింది.
వెలుతురుపై వివాదంతో...
శ్రీలంక ఇన్నింగ్స్ మొదలైన రెండు బంతులకే వర్షం వచ్చింది. అయితే దాదాపు అరగంట తర్వాత మళ్లీ ఆట మొదలు కాగా, ప్రసిధ్ కృష్ణ తన రెండో బంతికే ఉడారా (1)ను వెనక్కి పంపించాడు. వెలుతురు తగ్గడంతో లైట్ మీటర్‌తో పరీక్షించిన అంపైర్లు పేసర్లు బౌలింగ్ వేయరాదని, స్పిన్‌తో కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ఆటను నిలిపివేయాలంటూ లంక బ్యాటర్లు పదే పదే అంపైర్లతో వాదించినా వారు పట్టించుకోలేదు.
సుతార్ తన తొలి ఓవర్ చివరి బంతికి ప్రభాత్ జయసూర్య (2)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లంక బ్యాటర్ రివ్యూ చేసినా లాభం లేకపోగా, డ్రెస్సింగ్ రూమ్‌లో అతను తన ఆగ్రహాన్ని ప్రదర్శించడం కనిపించింది. వెలుతురు తగ్గిన స్థితిలో సుతార్ వేసిన ఈ బంతి సిరీస్‌లో స్పిన్నర్లు వేసిన 1958 బంతుల్లో అన్నింటికంటే వేగవంతమైంది (98.85 కిమీ./గం.) కావడం విశేషం!
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) ఫెర్నాండో 45; రాహుల్ (సి) డిక్‌వెలా (బి) కుమార 18; పడిక్కల్ (బి) నువాంతా 117; గిల్ (సి) డిక్‌వెలా (బి) ఫెర్నాండో 50; పంత్ (సి) ఉడారా (బి) నువాంతా 63; జడేజా (బి) ఫెర్నాండో 43; జురేల్ (నాటౌట్) 115; సారాంశ్ (సి) మిషారా (బి) ఫెర్నాండో 6; సుతార్ (సి) డిక్‌వెలా (బి) జయసూర్య 18; సిరాజ్ (ఎల్బీ) (బి) జయసూర్య 3; ప్రసిధ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (138 ఓవర్లలో 9 వికెట్లకు డిక్లేర్డ్) 503. వికెట్ల
పతనం: 1–37, 2–66, 3–207, 4–281, 5–296, 6–307, 7–419, 8–458, 9–489. బౌలింగ్: అసిత ఫెర్నాండో 29–5–106–4, లాహిరు కుమార 20–4–68–1, ప్రభాత్ 42–7–132–2, నువాంతా 38–3–154–2, దినూషా 3–0–8–0, ధనంజయ 2–0–8–0, మిషారా 4–0–16–0. శ్రీలంక తొలి ఇన్నింగ్స్: ఉడారా (సి) జైస్వాల్ (బి) ప్రసిధ్ 1; మిషారా (బ్యాటింగ్) 5; జయసూర్య (ఎల్బీ) (బి) సుతార్ 2; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (3 ఓవర్లలో 2 వికెట్లకు) 8.
వికెట్ల పతనం: 1–1, 2–8. బౌలింగ్: సిరాజ్ 1–0–1–0, ప్రసిధ్ 1–0–1–1, సుతార్ 1–0–6–1.
జైస్వాల్, ఫెర్నాండోలపై చర్య
టెస్టు మ్యాచ్ తొలి రోజు గొడవకు దిగిన భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్, లంక పేసర్ అసిత ఫెర్నాండోలపై ఐసీసీ చర్య తీసుకుంది. జైస్వాల్‌ను అవుట్ చేసిన ఫెర్నాండో ఏదో అనడంలో జైస్వాల్ తగ్గకుండా వెనక్కి వచ్చి అతనిపైకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో జైస్వాల్ హెల్మెట్ ఫెర్నాండో తలను తాకింది. ఈ ఘటనను లెవల్ 1 తప్పిదంగా గుర్తించిన ఐసీసీ... ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతాన్ని జరిమానాగా విధించింది. దీంతో పాటు ఇద్దరు ఆటగాళ్ల ఖాతాలో ఒక్కో డీమెరిట్ పాయింట్ కూడా చేరింది.


