న్యూఢిల్లీ: విన్‌స్టన్–సాలెమ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ దక్షిణేశ్వర్ సురేశ్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. అమెరికాలోని నార్త్ కరోలినాలో జరుగుతున్న ఈ టోర్నీలో ప్రపంచ 394వ ర్యాంకర్ తొలి రౌండ్‌లో ప్రపంచ 77వ ర్యాంకర్ మార్కస్ జిరోన్ (అమెరికా)ను బోల్తా కొట్టించాడు. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణేశ్వర్ 6–3, 7–5తో గిరోన్‌ను ఓడించాడు. 17 ఏస్‌లతో హడలెత్తించిన దక్షిణేశ్వర్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు కూడా చేశాడు.
తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని ఈ తమిళనాడు ప్లేయర్ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడైన దక్షిణేశ్వర్ 33 విన్నర్స్ కొట్టాడు. నెట్ వద్ద ఏడుసార్లు పాయింట్లు గెలిచాడు. వాస్తవానికి దక్షిణేశ్వర్ క్వాలిఫయింగ్‌లోనే నిష్క్రమించి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేదు. అయితే మెయిన్ ‘డ్రా’లోని నలుగురు ఆటగాళ్లు గాయాలతో చివరి నిమిషంలో వైదొలిగారు. దాంతో క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో ఓడిపోయిన నలుగురు అత్యుత్తమ ర్యాంక్ ఉన్న ఆటగాళ్లకు మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పించారు. ఈ జాబితాలో దక్షిణేశ్వర్ కూడా ఉండటంతో అతను మెయిన్ ‘డ్రా’లో బరిలోకి దిగి సత్తా చాటుకున్నాడు.


