బౌలర్‌గానూ ఇరగదీసిన వైభవ్‌ సూర్యవంశీ | Vaibhav Suryavanshi Takes 2 Wickets in 4 Balls in Duleep Trophy 2026 | Sakshi
Sakshi News home page

బౌలర్‌గానూ ఇరగదీసిన వైభవ్‌ సూర్యవంశీ

Aug 25 2026 12:42 PM | Updated on Aug 25 2026 12:44 PM

Vaibhav Sooryavanshi Turns Bowler, Bags 2 Wickets In 4 Balls

బ్యాటింగ్‌ సంచలనం, టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ బంతితోనూ ఇరగదీశాడు. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌లో కేవలం నాలుగు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి తన ఫస్ట్‌క్లాస్ వికెట్ల ఖాతా తెరిచాడు. ఈ టోర్నీలో వైభవ్‌ ఈస్ట్‌ జోన్‌కు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

నాలుగు బంతుల్లో రెండు వికెట్లు
నార్త్‌ఈస్ట్‌ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 26వ ఓవర్‌ వద్ద ఈస్ట్‌ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్.. షాబాజ్ అహ్మద్ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి బంతిని అందించాడు. తొలి ఓవర్‌లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన వైభవ్.. ఆ తర్వాత ఓవర్‌లో అద్భుతం చేశాడు.

28వ ఓవర్‌లో కిషన్ లింగ్‌డోహ్‌ను ఔట్ చేసి తన తొలి ఫస్ట్‌క్లాస్ వికెట్ సాధించాడు. వైభవ్ బంతిని అటాక్‌ చేయడానికి లింగ్‌డోహ్ ముందుకొచ్చాడు. అయితే బంతికి భారీ లీడింగ్ ఎడ్జ్ రావడంతో కవర్ ప్రాంతం వైపు వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న డెనిష్ దాస్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు.

ఆ తర్వాత మరో మూడు బంతులకే వైభవ్ మరో వికెట్ తీశాడు. ఇమ్లివాటి లెమ్తుర్ బ్యాట్ అంచును తాకిన బంతిని ఇషాన్ కిషన్ అద్భుతమైన రిఫ్లెక్స్‌తో క్యాచ్ పట్టాడు. దీంతో ఒకే ఓవర్‌లో వైభవ్‌కు రెండు వికెట్లు దక్కాయి.

బంతితోనూ వైభవ్‌కు మంచి భవిష్యత్తు..?
వైభవ్ సూర్యవంశీ ప్రధానంగా బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. భారీ షాట్లు ఆడగల సామర్థ్యంతో అతను ఇప్పటికే భారత క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందాడు.

అయితే వైభవ్ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ కూడా. అతని బౌలింగ్‌లో హిప్ రొటేషన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. దులీప్ ట్రోఫీలో లభించిన అవకాశాన్ని అతను చక్కగా ఉపయోగించుకుని నాలుగు బంతుల్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు.

దీంతో భవిష్యత్తులో అవసరమైనప్పుడు బంతితోనూ జట్టుకు ఉపయోగపడే పార్ట్‌టైమ్ ఆల్‌రౌండర్‌గా ఎదిగే అవకాశం వైభవ్‌కు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సచిన్‌తో మరో పోలిక
చిన్న వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి వచ్చి సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్‌ను ఇప్పటికే పలువురు సచిన్ టెండూల్కర్‌తో పోల్చుతున్నారు. సచిన్ కూడా చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి బ్యాట్‌తో పాటు అప్పుడప్పుడు బంతితోనూ భారత్‌కు కీలక వికెట్లు అందించాడు. ఇప్పుడు వైభవ్ కూడా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో తన ప్రతిభను చూపించడం ఆసక్తికరంగా మారింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఈస్ట్‌ జోన్‌ గెలుపు దిశగా సాగుతోంది. ఫాలో ఆన్‌ ఆడుతున్న ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 102 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి భారీ ఇన్నింగ్స్‌ ఓటమి దిశగా పరుగులు పెడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 111 పరుగులకే కుప్పకూలింది. దీనికి ముందు ఈస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

చదవండి: సిరాజ్‌ రెచ్చగొట్టాడు.. ప్రసిద్ద్‌ పని కానిచ్చేశాడు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement