సిరీస్‌పై గురి | India and Sri Lanka second Test from today | Sakshi
Sakshi News home page

సిరీస్‌పై గురి

Aug 23 2026 4:02 AM | Updated on Aug 23 2026 4:02 AM

India and Sri Lanka second Test from today

నేటి నుంచి భారత్, శ్రీలంక రెండో టెస్టు 

ఉదయం 10 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌ చానెల్, సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

కొలంబో: సమష్టి ప్రదర్శనతో శ్రీలంకపై తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత జట్టు రెండో పోరుకు సిద్ధమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ప్రారంభం కానున్న చివరి టెస్టులోనూ గెలిచి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరువవ్వాలనే లక్ష్యంతో శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరనుంది. 2023 జూలై తర్వాత భారత జట్టు విదేశీ గడ్డపై టెస్టు సిరీస్‌ విజయం సాధించలేదు. ఇక సొంతగడ్డపై కూడా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్‌లు కోల్పోయింది. 

ఈ నేపథ్యంలో లంకపై మరోసారి సంపూర్ణ ఆధిపత్యం కనబర్చి మూడేళ్ల తర్వాత విదేశీ గడ్డపై సిరీస్‌ ముద్దాడాలని టీమిండియా భావిస్తోంది. తొలి టెస్టులో దేవదత్‌ పడిక్కల్‌ భారీ సెంచరీతో కదం తొక్కగా... కేఎల్‌ రాహుల్, ధ్రువ్‌ జురేల్, రిషభ్‌ పంత్‌ అర్ధ శతకాలతో రాణించారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్, ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు. ఈ నేపథ్యంలో వారిద్దరు కూడా ఈ మ్యాచ్‌లో రాణిస్తే భారత బెంగ తీరనుంది. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న గిల్‌... ప్రాక్టీస్‌లో ఈ అంశంపై ప్రధానంగా దృష్టి సారించాడు. ఇక గత ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధ శతకం మాత్రమే చేసిన యశస్విపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 

కొలంబోలో పేస్‌ పిచ్‌! 
గత మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపని కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో సారాంశ్‌ జైన్‌కు తుది జట్టులో అవకాశం కల్పిస్తారా లేక... విన్నింగ్‌ కాంబినేషన్‌నే కొనసాగిస్తారా చూడాలి. తొలి టెస్టులో 25 ఓవర్లు వేసి ఒక్క వికెట్‌ మాత్రమే తీసిన కుల్దీప్‌ నెట్స్‌లోనూ ఎక్కువ సాధన చేయకపోయినా... ఒక్క మ్యాచ్‌తో అతడి ప్రతిభను అంచనా వేయొద్దని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. గత మ్యాచ్‌లో 10 వికెట్లతో సత్తా చాటిన మానవ్‌ సుతార్‌ మరోసారి కీలకం కానుండగా... రవీంద్ర జడేజా అటు బ్యాట్‌తో, ఇటు బంతితో మరింతగా రాణించాల్సిన అవసరముంది.

గాలేతో పోల్చుకుంటే కొలంబో పిచ్‌ ఆరంభంలో కాస్త పేస్‌కు సహకరించనున్న నేపథ్యంలో సిరాజ్‌ నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఆశించవచ్చు. మరోవైపు గత పదేళ్లలో టీమిండియాపై ఇంటా బయట సిరీస్‌ గెలవని శ్రీలంక జట్టు... ఈ సారైనా సిరీస్‌ను ‘డ్రా’ చేయాలని పట్టుదలగా ఉంది. గాలెలో స్పిన్‌ పిచ్‌ను సిద్ధం చేసి భంగపడ్డ ఆతిథ్య శ్రీలంక ఈ సారి కాస్త మెరుగైన పిచ్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. 

బ్యాటింగ్‌లో సొనాల్‌ దినుషా, నిరోషన్‌ డిక్‌వెలా, ధనంజయ డిసిల్వా, కమిల్‌ మిషారాపై ఆ జట్టు భారీ అశలు పెట్టుకుంది. గత మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయిన ప్రభాత్‌ జయసూర్య కొలంబోలో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేదానిపైనే లంక విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. పిచ్‌ ఆరంభంలో పేసర్లకు ఆ తర్వాత స్పిన్నర్లకు సహకరించనుండగా... మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు తక్కువ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement