నీరజ్‌ చోప్రాకు రెండో స్థానం | Neeraj Chopra finishes second in the prestigious Diamond League | Sakshi
Sakshi News home page

నీరజ్‌ చోప్రాకు రెండో స్థానం

Aug 23 2026 3:57 AM | Updated on Aug 23 2026 3:57 AM

Neeraj Chopra finishes second in the prestigious Diamond League

లుసానే: ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌ లుసానే అంచె పోటీల్లో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఈవెంట్‌లో బల్లెంను నీరజ్‌ 88.05 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్‌లో అతనికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అద్భుత ఫామ్‌లో ఉన్న శ్రీలంక త్రోయర్‌ రుమేశ్‌ పతిరగే 88.14 మీటర్లతో మొదటి స్థానం సాధించగా, పీటర్స్‌ అండర్సన్‌ (గ్రెనడా) 83.71 మీటర్లతో మూడో స్థానంతో ముగించాడు. తన రెండో ప్రయత్నంలో ఈ దూరాన్ని నమోదు చేసిన నీరజ్‌...తర్వాతి నాలుగు ప్రయత్నాల్లో దీనిని అధిగమించలేకపోయాడు. 

వీటిలో ఒకసారి ఫౌల్‌ కాగా, మరో సారి అతను అటెంప్ట్‌ కూడా చేయలేదు. అయితే ఇటీవలే గాయం నుంచి కోలుకున్న తర్వాత మొదటిసారి 88 మీటర్లకు పైగా జావెలిన్‌ విసరడం నీరజ్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రదర్శనగా చెప్పవచ్చు. తాజా ప్రదరద్శనతో డైమండ్‌ లీగ్‌ ‘ఫైనల్స్‌’ రేసులో నీరజ్‌ ఏడు నుంచి ఐదో స్థానానికి ఎగబాకాడు. టాప్‌–6కు ఫైనల్స్‌కు పోటీ పడే అవకాశం ఉంది. తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకునేందుకు ఆగస్టు 26–28 మధ్య జ్యూరిచ్‌ అంచె పోటీల్లో నీరజ్‌కు మరో అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement