ఫైనల్స్‌ లక్ష్యంగా... | Neeraj in action at the Lausanne Diamond League | Sakshi
Sakshi News home page

ఫైనల్స్‌ లక్ష్యంగా...

Aug 21 2026 3:59 AM | Updated on Aug 21 2026 3:59 AM

Neeraj in action at the Lausanne Diamond League

లుసానే డైమండ్‌ లీగ్‌ బరిలో నీరజ్‌

నేడు భారత స్టార్‌ అథ్లెట్‌ ఈవెంట్‌

లుసానే: ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ పోటీల్లో మళ్లీ సత్తా చాటేందుకు భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా సిద్ధమవుతున్నాడు. నేడు జరిగే లుసానే అంచె పోటీల్లో అతను బరిలోకి దిగుతున్నాడు. 2026 సీజన్‌లో ఇది నాలుగో అంచె కాగా నీరజ్‌ రెండోసారి మాత్రమే ఆడబోతున్నాడు. గాయం కారణంగా రాబత్, రోమ్‌ పోటీలకు దూరమైన అతను దోహాలో పాల్గొని 4వ స్థానంతో ముగించాడు. ఓవరాల్‌గా ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్న నీరజ్‌ ఇక్కడ మెరుగైన ప్రదర్శన కనబరిస్తే ‘ఫైనల్స్‌’కు అర్హత సాధించే అవకాశాలు మెరుగవుతాయి. 

రెండు ఒలింపిక్‌ పతకాల విజేత నీరజ్‌కు లుసానేలో శ్రీలంక సంచలనం రుమేశ్‌ పతిరగే నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇటీవలి గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతిరగే స్వర్ణం గెలుచుకోగా, నీరజ్‌కు రజతం దక్కింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పతిరగే తాజా సీజన్‌లో తాను పోటీ పడిన గత 9 ఈవెంట్లలో 8 పోటీల్లో విజేతగా నిలిచాడు. అతను ఇప్పటికే ఫైనల్స్‌కు అర్హత కూడా సాధించాడు. 

9 మంది పాల్గొంటున్న ఈ ఈవెంట్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ కీషోన్‌ వాల్కాట్‌ (ట్రినిడాడ్‌), రెండుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్సన్‌ (గ్రెనడా), టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత జాకబ్‌ వెలెచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌), వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత కర్టిన్‌ థాంప్సన్‌  (అమెరికా) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా... పారిస్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌ అర్షద్‌ నదీమ్‌ (పాకిస్తాన్‌), జూలియన్‌ వెబర్‌ (జర్మనీ) పోటీకి దూరమయ్యాడు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11.55 నుంచి జావెలిన్‌ త్రో ఈవెంట్‌ జరుగుతుంది. జావెలిన్‌ త్రో ఈవెంట్‌ను డైమండ్‌ లీగ్‌ యూట్యూబ్‌ చానెల్‌లో వీక్షించవచ్చు.  

కామన్వెల్త్‌ క్రీడలు ముగిసిన తర్వాత నీరజ్‌ స్విట్జర్లాండ్‌లోని బీల్‌లో ఉన్న తన శిక్షణా కేంద్రానికి వెళ్లిపోయాడు. తన కోచ్‌ జైవీర్‌ చౌధరీ, ఫిజియో ఇషాన్‌ మార్వా సమక్షంలో అతను రీహాబిలిటేషన్‌ను కొనసాగించడంతో పాటు ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నాడు. బ్రసెల్స్‌లో జరిగే ఫైనల్స్‌కు ఆరుగురు త్రోయర్లు క్వాలిఫై అవుతారు. లుసానే తర్వాత తమ ర్యాంక్‌ను మెరుగపర్చుకునేందుకు ఆటగాళ్లకు ఈ నెల 27 నుంచి జ్యూరిచ్‌లో జరిగే అంచెలో కూడా అవకాశం ఉంది. 2022లో డైమండ్‌ లీగ్‌ చాంపియన్‌గా నిలిచిన నీరజ్, ఆ తర్వాత వరుసగా మూడేళ్ల పాటు రెండో స్థానంతో ముగించాడు. లుసానేలో టాప్‌–3లో నిలిస్తే తొలి సారి భారీ ప్రైజ్‌మనీ ఈవెంట్‌ వరల్డ్‌ అథ్లెటిక్స్‌ అల్టిమేట్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు కూడా నీరజ్‌ ర్యాంక్‌ మెరుగవుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement