ఏడాది కాలంగా అద్భుత ఫలితాలు వచ్చాయి
తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ మనోగతం
ముంబై: భారత షూటర్, తెలంగాణకు చెందిన ఇషా సింగ్ ఇటీవల అద్భుత ప్రదర్శనతో వరుస విజయాలు అందుకుంది. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పుతూ ప్రపంచ కప్‌లో స్వర్ణం గెలుచుకోవడంతో పాటు వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌కు కూడా చేరుకుంది. మ్యూనిక్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఆమె భారత్‌కే చెందిన ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానం సాధించింది. ‘నేను ఏ ఈవెంట్‌లో బరిలోకి దిగినా ఎవరినో ఓడించడానికి కాకుండా నాకు నేనే పోటీగా భావిస్తా. నేను తలపడే క్రీడాంశంలో ముఖాముఖీ పోరు ఉండదు. కాబట్టి నా ఆటపై దృష్టి పెడితే సరిపోతుంది. నా ప్రదర్శనను మెరుగుపర్చుకోవడం కోసమే శ్రమిస్తా.
గత ఏడాది కాలంగా చాలా మంది ఫలితాలు రావడం సంతోషంగా ఉంది. నా శిక్షణలో నేను పడిన కష్టమంతా ఫలితాల రూపంలో కనిపిస్తోంది. నేను నేర్చుకున్న దానిని సమర్థంగా వాడుకోవడంతోనే విజయాలు దక్కుతున్నాయి’ అని ఇషా సింగ్ వ్యాఖ్యానించింది. త్వరలో జరిగే ఆసియా క్రీడలకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇటీవలి ప్రదర్శన పట్ల తనలో ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగిందని కూడా ఇషా చెప్పింది. ‘ప్రస్తుతం నేను ఎంతో ఆత్మవిశ్వాసంతో పోటీ పడగలగుతున్నా. తాజా విజయాలు నాలో ఈ నమ్మకాన్ని పెంచాయి. కేవలం పతకాలు గెలవడం మాత్రమే కాదు మొత్తంగా నా ప్రదర్శన కూడా సంతృప్తినిచ్చింది. ఆసియా క్రీడల్లోనూ దీనిని కొనసాగిస్తా’ అని ఆమె పేర్కొంది.
మను భాకర్ సహా ఇతర భారత షూటర్లందరితో తనకు స్నేహం ఉందని, అందరి మధ్య బంధం బాగుంటుందున్న ఇషా... షూటింగ్ క్రీడ స్వభావం కారణంగా సాంకేతిక అంశాల గురించి తాము ఎప్పుడూ చర్చించుకోమని స్పష్టం చేసింది. తన శిక్షణా పద్ధతుల్లో ప్రత్యేకంగా ఎలాంటి మార్పులు చేయలేదని, అయితే ఇంత అనుభవం తర్వాత కూడా ప్రాధమిక అంశాల్లో కొన్ని లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానని ఇషా వెల్లడించింది.
అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున మరిన్ని పతకాలు గెలవడమే తన లక్ష్యమని ఈ తెలంగాణ షూటర్ పేర్కొంది. ఒక ప్లేయర్‌గా తాను పోటీ పడే ప్రతీ టోర్నీలో గెలవాలనే అంతా భావిస్తారని, అయితే కొన్ని సార్లు ఇది సాధ్యం కాదని ఆమె అభిప్రాయపడింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగి అనూహ్య పరాజయాలు ఎదురైన సమయంలో ‘లెగో’ ఆడి సేదతీరుతానని, ఆ బ్లాగ్స్‌ను పేర్చడం ద్వారా తాను ఎంతో నేర్చుకుంటానని ఇషా సింగ్ వివరించింది.


