యువతి దుర్మరణం కేసులో ఎంపీ లింగమనేని రమేశ్‌ కుమారుడు | MP Lingamaneni Ramesh Son Booked in Madhapur Aston Martin Accident | Sakshi
Sakshi News home page

యువతి దుర్మరణం కేసులో ఎంపీ లింగమనేని రమేశ్‌ కుమారుడు

Aug 20 2026 5:59 PM | Updated on Aug 20 2026 6:26 PM

  Rajya Sabha MPs son booked in Inorbit Mall employee death case

ప్రమాదంలో మృతి చెందిన యువతి..

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్‌లో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. లగ్జరీ కార్ల వేగానికి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న వరుస ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి దుర్మరణం చెందింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్‌ కుమారుడు లింగమనేని సంజుష్‌పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆగస్టు 16న ఏం జరిగింది? 
ఆగస్టు 16వ తేదీ మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయం. మాదాపూర్ ఇనార్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్ అసోసియేట్‌గా పనిచేస్తున్న భారతి ముఖి అనే 26 ఏళ్ల యువతి, తన సహోద్యోగి పూజా అశోక్‌తో కలిసి ఐటీసీ కోహినూర్ హోటల్ సమీపంలో లంచ్ తీసుకురావడానికి వెళ్లింది.

లంచ్ ప్యాకెట్ తీసుకుని తిరిగి మాల్‌లోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా.. ఒక్కసారిగా దూసుకొచ్చిన లగ్జరీ స్పోర్ట్స్ కార్ 'ఆస్టన్ మార్టిన్' (TG-09-G-0666) అత్యంత వేగంగా భారతిని ఢీకొట్టింది. ఆ ధాటికి భారతి గాల్లోకి ఎగిరి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

లింగమనేని రమేశ్‌ కుమారుడే నిందితుడు
ఈ ఘటనపై లైఫ్‌స్టైల్ స్టోర్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, కారు వివరాలు పరిశీలించిన పోలీసులు.. కారు నడుపుతున్నది జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్‌ కుమారుడు లింగమనేని సంజుష్ (21) అని గుర్తించారు. అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలు తీసినందుకు గాను పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారు. 

నిందితుడు సంజుష్‌కు చట్టపరమైన నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిత్యం ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రజలతో రద్దీగా ఉండే సైబరాబాద్ ప్రాంతంలో ఇలాంటి సూపర్ లగ్జరీ కార్ల ర్యాష్ డ్రైవింగ్ రోజురోజుకూ పెరుగుతోంది. బతుకుదెరువు కోసం గ్రామాల నుంచి నగరానికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్న అమాయకులు ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌లకు బలవుతున్నారు.

కోట్లలో విలువై చేసే స్పోర్ట్స్ కార్లను నడిపేటప్పుడు వేగ నియంత్రణ పాటించకపోవడం ఎంతటి విషాదాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నా, చట్టం ముందు అందరూ సమానమే అని పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా పూర్తి నివేదిక ఏం తేలుస్తుంది అనేది చూడాల్సి ఉంది.

మాదాపూర్‌లో విషాదం.. కారు ఢీకొని యువతి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement