ఏక్తానగర్, గుజరాత్: కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. చింతన్ శివిర్- 2026కు హాజరయ్యేందుకు గుజరాత్ చేరుకున్న సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో రహదారుల అభివృద్ధికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. భవిష్యత్ అవసరాల దూరదృష్టితోనే జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు.
దేశంలో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, అదే చింతన్ శివిర్ ప్రధాన ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, కేంద్రం చేపడుతున్న కొత్త విధానాలు, పథకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని తెలిపారు.
తెలంగాణ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రహదారి మౌలిక వసతులను అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి అవసరమైన అన్ని కీలక ప్రాజెక్టులను సాధించేందుకు కృషి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.


