సూర్యాపేట: జిల్లాలోని 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న సుమారు 60 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందించేందుకు మునగాల మండలంలో రూ. 9.60 కోట్లతో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఈ ప్రాజెక్టుకు అక్టోబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
మునగాల మండలంలో జాతీయ రహదారి పక్కన, మునగాల–మాధారం మధ్య ఎంపిక చేసిన స్థలంలో ఈ కేంద్రీకృత వంటశాలను నిర్మించనున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఒకే కేంద్రం నుంచి ఆహారం తయారు చేసి, ప్యాకింగ్, రవాణా, పంపిణీ చేసే విధంగా ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. దేశంలోనే అత్యాధునిక సదుపాయాలతో ఈ వంటశాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి సింగరేణి కంపెనీ రూ. 9.60 కోట్ల విరాళం అందించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి చేసిన విజ్ఞప్తుల మేరకు సింగరేణి ఈ నిధులను సమకూర్చినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ఈ కార్యక్రమానికి సహకరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి కంపెనీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి కృతజ్ఞతలు తెలిపారు.


