విలీనంపై ఇంటర్‌ బోర్డు తొందరపాటు | Telangana Intermediate School Education Merger | Sakshi
Sakshi News home page

విలీనంపై ఇంటర్‌ బోర్డు తొందరపాటు

Nov 19 2026 5:45 AM | Updated on Nov 19 2026 5:47 AM

Telangana Intermediate School Education Merger

జీవో రాకుండానే కాలేజీలకు భరోసా

9, 10 క్లాసులు పెట్టుకోవచ్చని చెప్పిన వైనం

ప్రైవేటు యాజమాన్యాలతో బోర్డు కార్యదర్శి సమావేశం

నెలాఖరులోగా ‘విలీన’మార్గదర్శకాలు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ విద్యను పాఠశాల విద్యలో విలీనంపై ఇంటర్‌ బోర్డు తొందరపాటు నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ జీవో విడుదల కానప్పటికీ, వచ్చే ఏడాది నుంచి అన్ని తరగతులను నిర్వహించుకోవచ్చని బోర్డు కార్యదర్శి ప్రైవేట్‌ విద్యాసంస్థలకు చెప్పినట్లు సమాచారం.

వాస్తవానికి ఈ ప్రతిపాదన పరిశీలన దశలోనే ఉంది. దశలవారీగా చేపట్టేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ దశలోనే ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో బోర్డు కార్యదర్శి ఇటీవల సమావేశం అయ్యారు. ఈ క్రమంలో ఆమె ప్రైవేటు విద్యాసంస్థలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మౌలిక సదుపాయాలుంటే తొమ్మిది పది తరగతులను ఇంటర్‌ కాలేజీల్లో నిర్వహించుకోవచ్చని ఆమె చెప్పినట్లు తెలిసింది.

ఈ క్రమంలో ప్రైవేట్‌ కాలేజీలకు బోర్డు ఇదే విషయాన్ని తెలియజేస్తూ లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలు ఆసక్తి చూపితే 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాల విద్యను నిర్వహించుకోవచ్చని కార్యదర్శి అన్నట్లు తెలిసింది. ఇందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతులు జారీ చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే అన్ని తరగతులను ఒకేసారి ప్రారంభించాలన్న నిబంధన ఏమీ లేదని, మొదట కొన్ని తరగతులను ప్రారంభించి, అవసరాన్ని బట్టి తదుపరి సంవత్సరాల్లో మిగిలిన తరగతులను దశలవారీగా అందుబాటులోకి తీసుకురావచ్చని యాజమాన్యాలకు చెప్పినట్లు తెలిసింది.

మరోవైపు ఇంటర్మీడియట్‌ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే అంశంపై ప్రభుత్వం విద్యావేత్తలు, విద్యారంగ నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. ఈ నెలాఖరులోగా విలీన ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంటర్‌ విలీనానికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని, ఇంతవరకు ఏ ప్రైవేట్‌ యాజమాన్యాలకు ఇంటర్‌ బోర్డు లేఖలు రాయలేదని, క్లాసులు పెట్టుకోమని చెప్పలేదని, అధికారికంగా అన్ని నిర్ణయాలు జరిగిన తర్వాతే యాజమాన్యాలకు మార్గదర్శకాలు ఇస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పీజీ మెడికల్‌ ఫీజు పెంపునకు బ్రేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement