హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి బీసీ సీఎం కచ్చితంగా అవుతారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తేల్చిచెప్పారు. బీసీల హక్కుల కోసం మాట్లాడే ధైర్యం రాహుల్ గాంధీ ఇచ్చారని, తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడని ఘంటాపదంగా చెబుతున్నానన్నారు. మహేష్ గౌడ్ ఢిల్లీకి వెళ్లే క్రమంలో శంషాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
‘రాహుల్ గాంధీ, ఖర్గే ఇచ్చిన ధైర్యంతో బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెబుతున్నా. రాహుల్ భారత్ జోడో యాత్రతో ఎవరు వాటా ఎంతో వారికి అంత అనేది రాహుల్ గాంధీ నినాదం. బీసీలకు రావాల్సిన వాటా తీసుకుంటాం. కుల సర్వే సాకారం అయి ఉంటే యావద్దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా ఉండేది.
ప్రధాని మోదీ బీసీలను వంచనకు గురి చేస్తున్నారు. తెలంగాణ పిలుపు కేంద్రానికి కనువిప్పు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 55 శాతానికి పైగా సర్పంచ్‌లను చేశాం. మున్సిపల్ ఎన్నికల్లో 58 శాతం బీసీలకు సీట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మంత్రివర్గంలో, ఎమ్మెల్సీల్లో, కార్పొరేషన్లలో బీసీల సంఖ్యను పెంచుతాం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టివిక్రమార్క, మంత్రుల సహకారంతో కుల సర్వే నిర్వహించి డాక్యుమెంట్ ఇచ్చాం.
మోదీ గద్దె దిగే టైం వచ్చింది. రాహుల్ ప్రధాని కావడం తథ్యం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కుల సర్వే నిర్వహిస్తాం. కులాలను పక్కనపెట్టి బీసీలు ఏకం కావాలి. పోరాడితే పోయేదేమీ లేదు. భవిష్యత్ తరాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: CECని తొలగించాలని రాష్ట్ర వ్యాప్త నిరసనలు


