సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సభావేదిక
ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభించనున్న సీఎం
రూ.544 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు... భారీ బహిరంగ సభ
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో దిగి అక్కడి నుంచి ర్యాలీగా సభాస్థలికి సీఎం చేరుకోనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలులో భాగంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ప్రారంభించనున్నారు.
అనంతరం సిద్దిపేట పట్టణ శివారులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా రూ 544.11కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన, వివిధ భవనాల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో దుబ్బాక, సిద్ధిపేట నియోజకవర్గాల్లో రూ.200 కోట్ల చొప్పున నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన వంటి కార్యక్రమాలున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ వేర్వేరుగా వచ్చారు. ఇలా వేర్వేరుగా సభా ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రులు రావడంతో ఏం జరిగిందా? అని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకున్నారు.
ఇదీ చదవండి: రైతు వ్యతిరేక విధానాలపై ఏఐకేఎస్ సమరభేరి


