తమిళనాడులో జరిగిన సదరన్ కౌన్సిల్‌లో సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఏళ్ల తరబడి వివాదాలు కొనసాగిస్తే ఎవరికీ ప్రయోజనం ఉండదు
న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు ఈ సమస్యలను పరిష్కరించలేవు
సెప్టెంబర్‌లో 4 రాష్ట్రాల సీఎంలతో ఢిల్లీలో భేటీ నిర్వహిస్తాం
సదరన్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
సాక్షి, హైదరాబాద్/సాక్షి, చెన్నై: దక్షిణాది రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి దేశ ప్రగతికి మూలాధారమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జలవివాదాలను న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు పరిష్కరించలేవని.. పరస్పర సంప్రదింపులతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకోవడం తప్పు కాదని.. అయితే ఆ నెపంతో నీటిని సముద్రంలోకి వదిలేస్తూ ఏళ్ల తరబడి వివాదాలు కొనసాగిస్తే ఏ ఒక్కరికీ ప్రయోజనం ఉండదన్నారు. అందుకే తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య నెలకొన్న జల వివాదాలపై చర్చించడానికి సెప్టెంబర్ తొలి వారంలో ఢిల్లీలో ఆయా రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహిస్తామని అమిత్ షా ప్రకటించారు. తమిళనాడులోని మహాబలిపురంలో గురువారం జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ భేటీలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లడంతో), తమిళనాడు సీఎం సి.జోసెఫ్ విజయ్, ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం డి.కె.శివకుమార్, కేరళ వి.డి.సతీశన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కృష్ణా జలాల వాడకానికి అనుమతించాలి: కర్ణాటక సీఎం
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2013లో కృష్ణా జలాల పంపిణీపై తీర్పును ప్రకటించగా, ఇంకా ఆ తీర్పును నోటిఫై చేయలేదని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఈ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. 10 నిమిషాల్లో జరగాల్సిన పని 13 ఏళ్లు గడిచినా పరిష్కారం కాలేదని, ట్రిబ్యునల్ తీర్పును నొటిఫై చేయకపోయినా..ఆ తీర్పులో జరిపిన కేటాయింపుల ఆధారంగా కృష్ణా జలాలను వాడుకోవడానికి అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నీటి కేటాయింపులు లేకుండా తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకోవాలని ఆయన కోరగా చర్చలతో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని అమిత్‌షా సూచించారు.
పోలవరం నుంచే గోదావరి–కావేరి అనుసంధానం
పోలవరం ప్రాజెక్టు నుంచే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వివాదాన్ని పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి అమిత్ షా సూచించగా అన్ని ప్రాజెక్టులపై చర్చించి ఏకాభిప్రాయానికి వద్దామని చంద్రబాబు సూచించారు. పాలమూరు–రంగారెడ్డి, తుమ్మిడిహెట్టి, గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టులతోపాటు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేసే అంశంపై సెప్టెంబర్‌లో ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలతో సమావేశం నిర్వహిస్తామని ఈ సందర్భంగా అమిత్ షా ప్రకటించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
ఏపీ–తెలంగాణ విభజన అంశాలపై..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తులు, అప్పుల విభజన, ఇతర పెండింగ్ సమస్యలను కేంద్ర హోంశాఖ సంప్రదింపులతో త్వరలోనే పరిష్కరించుకోవడానికి రెండు రాష్ట్రాల ప్రతినిధులు సమ్మతించారు.


