హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌ఐర్(ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) అంశానికి సంబంధించి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) సుదర్శన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఫారం-6, 6A, 7, 8లో తప్పుడు ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ప్రధానంగా ఫారం-7లో బల్క్ దరఖాస్తుల అంశానికి సంబంధింది ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆ దరఖాస్తులు నిజమైనవి కావంటూ ఆరోపణలు ఉన్నాయని, తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చర్యలు తప్పవన్నారు. తప్పుడు ప్రకటనలపై RP Act, 1950లోని సెక్షన్ 31 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ డీఈఓతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. చర్యలకు ముందు రూల్-20 ప్రకారం విచారణ తప్పనిసరిగా ఉండాలని సీఈఓ సూచించారు.
బల్క్ దరఖాస్తులు అంటే ఏమిటి..?
సాధారణంగా ఒక వ్యక్తి తనకు తెలిసిన ఒకరిద్దరి ఓట్లపై (మరణించినా లేదా ఇల్లు మారినా) స్వయంగా ఫిర్యాదు చేస్తారు. కానీ రాజకీయ లబ్ధి కోసమో లేదా ఇతర వ్యూహాలతోనో కొన్ని సంస్థలు లేదా వ్యక్తులు ఒక నిర్దిష్ట ప్రాంతంలో (ఉదాహరణకు ఒక నియోజకవర్గం లేదా బూత్ పరిధిలో) పెద్ద మొత్తంలో ఓట్లను తొలగించాలని ఇలాంటి బల్క్ దరఖాస్తులు ఇస్తుంటారు. ఇప్పుడు దీనిపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది.
కాగా, తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. అభ్యంతరాలను స్వీకరించే గడువు గత షెడ్యూల్ ప్రకారం గత నెల సెప్టెంబరు 16 వరకు ఉంది. అయితే, దీన్ని ఇప్పుడు అక్టోబరు 7 వరకు పొడిగించారు. తుది జాబితాను గత షెడ్యూల్ ప్రకారం.. అక్టోబరు 19న ప్రకటించాల్సి ఉండగా, రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు నవంబరు 9న ప్రకటిస్తారు.
ఇదీ చదవండి: తెలంగాణ సెక్రటేరియెట్‌లో మంచి నీటి కష్టాలు?


