హెచ్‌ఐవీపై అవగాహనతోనే నివారణ సాధ్యం | Awareness program on HIV at KIMS College of Nursing Hyderabad | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీపై అవగాహనతోనే నివారణ సాధ్యం

Oct 5 2026 5:15 PM | Updated on Oct 5 2026 6:01 PM

Awareness program on HIV at KIMS College of Nursing Hyderabad

కిమ్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌ అవగాహన కార్యక్రమం

హైదరాబాద్: హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన పెంచడంతో పాటు వ్యాధి నివారణ, ముందస్తు పరీక్షలు, సామాజిక బాధ్యతపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు కిమ్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కిమ్స్‌ ఆసుపత్రి సికింద్రాబాద్‌ 15వ అంతస్తులోని ఆడిటోరియంలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ (టీజీఎస్‌ఏసీఎస్‌) సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీజీఎస్‌ఏసీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డా. కె. విద్యాసాగర్‌ మాట్లాడుతూ హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. తెలంగాణతో పాటు దేశంలో హెచ్‌ఐవీ పరిస్థితి, గణాంకాలు, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తుగా వ్యాధిని గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్ష, అపోహలను తొలగించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రజల్లో అవగాహన కల్పించడంలో నర్సింగ్‌ విద్యార్థులు పీర్‌ ఎడ్యుకేటర్లుగా కీలక పాత్ర పోషించాలని సూచించారు.

కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న కిమ్స్‌ హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (అకడమిక్స్‌) డా. ఎస్‌. మణిమాలారావు మాట్లాడుతూ హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారికి సేవలందించేటప్పుడు నర్సింగ్‌ విద్యార్థులు మానవతా దృక్పథం, వృత్తి నైపుణ్యం, నైతిక విలువలను పాటించాలని సూచించారు. ఆరోగ్య అవగాహన, వ్యాధి నివారణ, కౌన్సెలింగ్‌, రోగుల హక్కుల పరిరక్షణలో నర్సుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.

ఈ సందర్భంగా నర్సింగ్‌ విద్యార్థులు వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పోస్టర్‌ ప్రదర్శనలు, స్కిట్‌, క్విజ్‌ పోటీల ద్వారా హెచ్‌ఐవీ నివారణ, అవగాహన, సామాజిక బాధ్యతకు సంబంధించిన ముఖ్య సందేశాలను ప్రజలకు చేరేలా వివరించారు.

కార్యక్రమంలో కిమ్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, టీజీఎస్‌ఏసీఎస్‌ ప్రతినిధులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, నర్సింగ్‌ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నివారణలో అవగాహన, అపోహల తొలగింపు, వివక్షకు తావులేని మానవతా దృక్పథం ఎంతో అవసరమని కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. భవిష్యత్‌ నర్సులు ఆరోగ్య అవగాహన రాయబారులుగా సమాజంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement