ముమ్మర సాధన | Team India to play second Test against Sri Lanka from tomorrow | Sakshi
Sakshi News home page

ముమ్మర సాధన

Aug 22 2026 4:17 AM | Updated on Aug 22 2026 4:17 AM

Team India to play second Test against Sri Lanka from tomorrow

నెట్స్‌లో శ్రమించిన టీమిండియా క్రికెటర్లు

రేపటి నుంచి శ్రీలంకతో రెండో టెస్టు

లెఫ్టార్మ్‌ స్పిన్‌ను ఎదుర్కోవడంపై గిల్‌ దృష్టి  

కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన భారత క్రికెట్‌ జట్టు... రెండో మ్యాచ్‌ కోసం సాధన ప్రారంభించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరాలంటే ప్రతీ మ్యాచ్‌లో విజయం కీలకం కాగా... భారత ప్లేయర్లు లోపాలను సరిదిద్దుకునే పనిలో పడ్డారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలేలో జరిగిన తొలి టెస్టులో సంపూర్ణ ఆధిపత్యంతో గెలుపొందిన టీమిండియా... ఆదివారం నుంచి లంకతో రెండో టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్, బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్, బౌలింగ్‌ కోచ్‌ సాయిరాజ్‌ బహుతులే పర్యవేక్షణలో జట్టు సభ్యులు ప్రాక్టీస్‌ చేశారు. 

ముఖ్యంగా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్లలను ఎదుర్కోవడంపై ప్రధాన దృష్టి పెట్టాడు. తొలి టెస్టులో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 16, 8 పరుగులతో నిరాశ పరిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఎడంచేతివాటం స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య బౌలింగ్‌లోనే అతడు అవుటయ్యాడు. దీంతో లోపాలను అధిగమించేందుకు నెట్స్‌లో లెఫ్టార్మ్‌ స్పిన్నర్లను ఎదుర్కోవడంపై గిల్‌ ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. ఇప్పటి వరకు ఆడిన 42 టెస్టుల్లో గిల్‌ 11 సార్లు లెఫ్టార్మ్‌ స్పిన్నర్ల బౌలింగ్‌లో అవుటయ్యాడు.

శుక్రవారం సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ నెట్స్‌లో మానవ్‌ సుతార్, రవీంద్ర జడేజాతో పాటు పలువురు స్థానిక లెఫ్టార్మ్‌ స్పిన్నర్ల బౌలింగ్‌లో గిల్‌ సాధన చేశాడు. గిల్‌ ప్రాక్టీస్‌ను సాయిరాజ్‌ బహుతులే ప్రత్యేకంగా పర్యవేక్షించాడు. ‘గిల్‌ నిరంతరం పరుగులు రాబట్టడాన్ని ఇష్టపడతాడు. గత మ్యాచ్‌లో అది సాధ్యపడలేదు. దీంతో వెంటనే ఆ లోపాన్ని అధిగమించేందుకు సిద్ధమయ్యాడు. పరిస్థితులకు తగ్గట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు’ అని బహుతులే వెల్లడించాడు. ఇక కుడిచేతివాటం ఆఫ్‌ స్పిన్నర్‌లపై గిల్‌కు మంచి రికార్డు ఉంది.  

కేఎల్‌ రాహుల్, కుల్దీప్‌ గైర్హాజరు 
తొలి టెస్టులో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న సీనియర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ శుక్రవారం ప్రాక్టీస్‌కు దూరంగా ఉండిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో కండరాలు పట్టేసి ఇబ్బంది పడిన రాహుల్‌... రెండో టెస్టులో భారీ ఇన్నింగ్స్‌ ఆడాలని భావిస్తున్నాడు. లంకతో మొదటి టెస్టులో అతడు వరుసగా 82, 35 పరుగులు చేశాడు. 

గతంలోనే శ్రీలంకలో పర్యటించిన భారత జట్టులో సభ్యుడైన రాహుల్‌... తన అనుభవాన్నంతా రంగరించి స్పిన్‌ ఉచ్చును చేధించడంతోనే భారత్‌ తొలి మ్యాచ్‌లో సులువుగా గెలుపొందింది. అతడితో పాటు తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కూడా ప్రాక్టీస్‌ చేయలేదు. ఆటగాళ్లు కసరత్తులు చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న కుల్దీప్‌... అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయకుండానే మైదానాన్ని వీడాడు. సారాంశ్‌ జైన్‌ కొన్ని ఓవర్లు బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. అతడి బౌలింగ్‌లో పంత్, గిల్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. ‘రాహుల్, కుల్దీప్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు’ అని బహుతులే పేర్కొన్నాడు.  

‘ఒక్క మ్యాచ్‌తో కుల్దీప్‌ ప్రతిభ తగ్గిపోదు’ 
శ్రీలంకతో తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన మణికట్టు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు భారత స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ సాయిరాజ్‌ బహుతులే అండగా నిలిచాడు. గాలే వేదికగా జరిగిన టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 25 ఓవర్లు వేసిన కుల్దీప్‌... 103 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్‌ మాత్రమే తీశాడు. కెరీర్‌లో రెండో టెస్టు మ్యాచ్‌ ఆడిన మానవ్‌ సుతార్‌ 10 వికెట్లు పడగొట్టగా... జడేజా పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ 4 వికెట్లు తీశాడు. ప్రత్యర్థి స్పిన్నర్లు కూడా బంతిని గింగిరాలు తిప్పిన చోట కుల్దీప్‌ ప్రభావం చూపలేకపోయాడు. 

ఈ నేపథ్యంలో బహుతులే మాట్లాడుతూ.... ‘అతడు చాలా చక్కగా బౌలింగ్‌ చేశాడు. గాలేలోని పరిస్థితుల నేపథ్యంలో అతడి బాధ్యతలు వేరేవి. నా దృష్టిలో అతడొక మ్యాచ్‌ విన్నర్‌. మా ప్రణాళికల్లో అతడు కీలకం. ఒక్క మ్యాచ్‌ ద్వారానే అతడి ప్రతిభను అంచనా వేయడం సరైంది కాదు’ అని పేర్కొన్నాడు. ఇక తొలి టెస్టులో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్న మానవ్‌ సుతార్‌పై బహుతులే ప్రశంసలు కురిపించాడు. 

‘దేశవాళీల నుంచి సుతార్‌ను గమనిస్తున్నా. అతడు చాలా బాగా బౌలింగ్‌ చేస్తున్నాడు. విభిన్న పరిస్థితుల్లో ఎలా రాణించాలో సుతార్‌కు బాగా తెలుసు. ఎలాంటి పిచ్‌పై ఎలాంటి బంతులు వేసి ఫలితం రాబట్టాలి... ఏ బ్యాటర్‌కు ఎలాంటి ఫీల్డ్‌ ప్లేస్‌మెంట్‌తో బౌలింగ్‌ చేయాలి... ఇలా అతడి ప్రణాళికలు చాలా స్పష్టంగా ఉంటాయి. దీంతో అతడు జట్టుకు అదనపు బలంగా మారాడు’ సాయిరాజ్‌ బహుతులే వెల్లడించాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement