డిఫెండింగ్ చాంపియన్‌గా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ బరిలోకి
న్యూయార్క్: గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరమైన స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్‌కరాజ్ పునరాగమనానికి సిద్ధమయ్యాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ద్వారా అల్‌కరాజ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ‘ఇక మొదలు పెడదాం’ అంటూ యూఎస్ ఓపెన్ లోగో ముందు నిల్చున్న ఫొటోను అల్‌కరాజ్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. కుడి చేతి గాయం కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆటకు దూరమైన అల్‌కరాజ్... ఇప్పుడు పూర్తి స్థాయిలో కోలుకొని యూఎస్ ఓపెన్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు.
కెరీర్‌లో ఏడు (ఆ్రస్టేలియా ఓపెన్ 2026; ఫ్రెంచ్ ఓపెన్ 2024, 2025; వింబుల్డన్ 2023, 2024; యూఎస్ ఓపెన్ 2022, 2025) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన అతడు... మొట్టమొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ న్యూయార్క్‌లోనే సాధించాడు. 19 ఏళ్ల వయసులో 2022లో యూఎస్ ఓపెన్ టైటిల్ అందుకున్న అల్‌కరాజ్ ఆ సమయంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్న అతిపిన్న వయసు్కడిగా రికార్డు సృష్టించాడు. సుదీర్ఘ కాలంగా ఆటకు దూరమైనప్పటికీ అల్‌కరాజ్ ఇప్పటికీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలోనే ఉండటం గమనార్హం.
ఈ ఏడాది ఆరంభంలో ఆ్రస్టేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన ఈ స్పెయిన్ యంగ్‌స్టర్... ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలకు దూరమయ్యాడు. గతేడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో యానిక్ సినెర్‌ను మట్టికరిపించి విజేతగా నిలిచిన అల్‌కరాజ్ డిఫెండింగ్ చాంపియన్‌గా సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ బరిలోకి దిగనున్నాడు. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 13 వరకు యూఎస్ ఓపెన్ జరగనుంది.
వైదొలిగిన సినెర్
మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ప్రపంచ నంబర్‌వన్, గత ఏడాది రన్నరప్ యానిక్ సినెర్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నుంచి వైదొలిగాడు. గత నెలలో అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించిన సినెర్ వింబుల్డన్ టోర్నీ టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత గాయపడటంతో యూఎస్ ఓపెన్ సన్నాహక టోర్నీలైన మాంట్రియల్, సిన్సినాటి ఓపెన్ నుంచి సినెర్ తప్పుకున్నాడు. సినెర్ ఈ ఏడాది 44 మ్యాచ్‌ల్లో గెలిచి, 3 మ్యాచ్‌ల్లో ఓడి ఓవరాల్‌గా ఆరు సింగిల్స్ టైటిల్స్ సాధించాడు.


