జ్వెరెవ్‌ X షెల్టన్‌ | Today US Open mens singles final | Sakshi
Sakshi News home page

జ్వెరెవ్‌ X షెల్టన్‌

Sep 13 2026 12:26 AM | Updated on Sep 13 2026 12:26 AM

Today US Open mens singles final

నేడు పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌  

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ  

రా.11.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రసారం  

న్యూయార్క్‌: టెన్నిస్‌ సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో కొత్త విజేత ఎవరో నేడు తేలనుంది. తొలి టైటిల్‌ సాధించాలని పట్టుదలగా ఉన్న టాప్‌ సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), 8వ సీడ్‌ బెన్‌ షెల్టన్‌ (అమెరికా) నేడు జరిగే ఫైనల్‌ పోరులో తలపడనున్నారు. జ్వెరెవ్‌ ఫైనల్‌ చేరడం ఇది రెండో సారి. 2020లో ఆఖరి మెట్టుపై అతని డొమినిక్‌ థీమ్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలవగా, షెల్టన్‌ ఫైనల్‌కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. 

ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచి, వింబుల్డన్‌ ఫైనల్లో ఓడిన జ్వెరెవ్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి సెమీఫైనల్లో జ్వెరెవ్‌ 6–3, 7–6 (9/7), 7–6 (8/6) స్కోరుతో కరెన్‌ ఖచనోవ్‌ (రష్యా)పై విజయం సాధించాడు. ఆ తర్వాత జరిగిన రెండో సెమీస్‌లో షెల్టన్‌ 4–6, 6–3, 6–3, 7–5తో అమెరికాకే చెందిన ఫ్రాన్సిస్‌ టియాఫోను ఓడించాడు.  

సెమీస్‌ మ్యాచ్‌కు ముందు ఖచనోవ్‌తో ఆడిన 9 మ్యాచ్‌లలో 6–3తో ఆధిక్యంలో ఉన్న జ్వెరెన్‌ ఈ సారి కూడా తన పైచేయిని ప్రదర్శించాడు. తొలి సెట్‌లో 3–3 తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకున్న జ్వెరెవ్‌ ఆ తర్వాత ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. మరో గేమ్‌ కూడా అలవోకగా జ్వెరెవ్‌ ఖాతాలో చేరింది. తర్వాతి రెండు సెట్‌లలో మాత్రం టాప్‌ సీడ్‌కు గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరూ హోరాహోరీగా పోరాడటంతో స్కోరు టైబ్రేక్‌కు చేరింది. ఈ దశలో ఖచనోవ్‌ పైచేయి సాధించినా దానిని నిలబెట్టుకోలేకపోయాడు. మూడో సెట్‌ కూడా దాదాపు ఇదే తరహాలో సాగింది. 

టైబ్రేక్‌లో 2–5తో వెనుకబడినా జ్వెరెవ్‌ పట్టుదలగా తన స్థాయికి తగ్గ ఆటతీరుతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. జ్వెరెవ్‌ 15 ఏస్‌లతో విరుచుకుపడటం విశేషం. టియాఫోతో జరిగిన రెండో సెమీస్‌లో షెల్టన్‌ తొలి సెట్‌ చేజార్చుకున్నా... కోలుకొని ఆ తర్వాత ప్రత్యర్థిపై చెలరేగుతూ దూసుకుపోయాడు. ఈ సెట్‌లో ఏకంగా 14 అన్‌ఫోర్స్‌డ్‌ ఎర్రర్స్‌ చేసిన షెల్టన్‌ సహచర అమెరికన్‌కు అవకాశం కల్పించాడు. 

రెండో సెట్‌లో ఎనిమిదో గేమ్‌ను బ్రేక్‌ చేసి ముందంజ వేసిన షెల్టన్‌ సునాయాసంగా సెట్‌ను ముగించాడు. మూడో సెట్‌ కూడా అతని నియంత్రణలోనే సాగింది. ఈ సెట్‌లోనే అతను 12 విన్నర్స్‌ కొట్టడం షెల్టన్‌ ఆధిపత్యాన్ని చూపించింది. 1972 తర్వాత యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరిన తొలి నల్లజాతి అమెరికన్‌గా షెల్టన్‌ గుర్తింపు పొందాడు. అతను గెలిస్తే ఆండీ రాడిక్‌ (2003) తర్వాత గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన మొదటి అమెరికా ఆటగాడిగా నిలుస్తాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement