అల్‌కరాజ్- బెన్ (Photo Credit: US Open X)
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ కార్లోస్ అల్‌కరాజ్ (స్పెయిన్) ప్రస్థానం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. అమెరికా నంబర్‌వన్ ప్లేయర్, ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ అసాధారణ ఆటతీరు కనబరిచి అల్‌కరాజ్‌ను బోల్తా కొట్టించాడు.
నాలుగు గంటల 28 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ షెల్టన్ 6–7 (5/7), 6–1, 6–3, 1–6, 7–6 (10/7)తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ మూడో ర్యాంకర్ అల్‌కరాజ్‌ను ఓడించి ఈ టోర్నీలో రెండోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.
కాగా 2023లో తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్న షెల్టన్... సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. గతంలో అల్‌కరాజ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన షెల్టన్ నాలుగో ప్రయత్నంలో తొలి విజయం రుచి చూశాడు.
షెల్టన్ తన కెరీర్‌లో టాప్–3 ర్యాంకర్‌పై గెలుపొందడం కూడా ఇదే తొలిసారి. అల్‌కరాజ్‌తో జరిగిన మ్యాచ్‌లో షెల్టన్ తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయాడు. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని వరుసగా రెండు సెట్‌లు గెలిచాడు.
అనంతరం అల్‌కరాజ్ తేరుకొని నాలుగో సెట్‌ను దక్కించుకున్నాడు. నిర్ణాయక ఐదో సెట్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. స్కోరు 6–6తో సమం కావడంతో ‘సూపర్ టైబ్రేక్’ అనివార్యమైంది. కీలకమైన సూపర్ టైబ్రేకర్‌లో షెల్టన్ తొలుత పది పాయింట్లు సాధించి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు.
షెల్టన్, అల్‌కరాజ్ మ్యాచ్ యూఎస్ ఓపెన్ చరిత్రలో ఆలస్యంగా ముగిసిన మ్యాచ్‌గా గుర్తింపు పొందింది. అమెరికా కాలమానం ప్రకారం షెల్టన్, అల్‌కరాజ్ మ్యాచ్ మంగళవారం రాత్రి గం. 11:05 నిమిషాలకు మొదలై బుధవారం తెల్లవారుజామున గం 3:33 నిమిషాలకు ముగిసింది.
అంతకుముందు 2022లో అల్‌కరాజ్, యానిక్ సినెర్ (ఇటలీ) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబరు 7న బుధవారం రాత్రి గం. 9:35కు మొదలై సెప్టెంబరు 8న గురువారం తెల్లవారుజామున గం. 2:50 నిమిషాలకు ముగిసింది.
టియాఫో మూడోసారి...
సెమీఫైనల్లో అమెరికాకే చెందిన ప్రపంచ 12వ ర్యాంకర్ ఫ్రాన్సెస్ టియాఫోతో షెల్టన్ ఆడనున్నాడు. దాంతో ఒక అమెరికా ప్లేయర్ యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆడటం ఖాయమైంది. అమెరికాకే చెందిన ప్రపంచ 46వ ర్యాంకర్ అలెక్స్ మిచెల్సన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో టియాఫో 5–7, 3–6, 7–5, 6–3, 7–6 (10/6)తో గెలుపొంది మూడోసారి ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు.
4 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో టియాఫో తొలి రెండు సెట్‌లను కోల్పోయి... ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లను సొంతం చేసుకోవడం విశేషం. 2022 సెమీఫైనల్లో అల్‌కరాజ్ చేతిలో, 2024 సెమీఫైనల్లో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) చేతిలో ఓడిపోయిన టియాఫో ఈసారి షెల్టన్‌పై గెలుస్తాడా లేదా వేచి చూడాలి. షెల్టన్, టియాఫోలలో ఎవరు గెలిచినా వారి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ అవుతుంది.
కొత్త వరల్డ్ నంబర్‌వన్ రిబాకినా.. సెమీస్‌లో పెగులా
మహిళల సింగిల్స్‌లో రిబాకినా (కజకిస్తాన్) సెమీఫైనల్ చేరుకొని తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకుంది. క్వార్టర్ ఫైనల్లో రిబాకినా 3–6, 6–1, 6–4తో కిన్‌వెన్ జెంగ్ (చైనా)పై నెగ్గింది. మరో క్వార్టర్ ఫైనల్లో పెగూలా (అమెరికా) 3–6, 6–4, 6–3తో ఎమ్మా నవారో (అమెరికా)పై గెలిచింది.


