అలెగ్జాండర్ జ్వెరెవ్ (PC: US Open Tennis X)
ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న యూఎస్ ఓపెన్ టైటిల్‌ను జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ సొంతం చేసుకున్నాడు. అమెరికా యువ ఆటగాడు బెన్ షెల్టన్‌పై నాలుగు సెట్లలో విజయం సాధించి తొలిసారి ఫ్లషింగ్ మెడోస్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. ఆర్థర్ యాష్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో జ్వెరెవ్ 6-3, 7-6(2), 5-7, 6-2తో షెల్టన్‌ను ఓడించాడు. దీంతో 2026లో అతడి ఖాతాలో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది.
ఫైనల్‌ను జ్వెరెవ్ దూకుడుగా ప్రారంభించాడు. బేస్‌లైన్ నుంచి పదునైన షాట్లతో షెల్టన్‌పై ఒత్తిడి పెంచాడు. అమెరికా ఆటగాడి డబుల్ ఫాల్ట్‌లు కూడా జ్వెరెవ్‌కు కలిసొచ్చాయి. ఆరంభంలోనే సర్వీస్ బ్రేక్ సాధించిన అతడు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు. 6-3తో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో షెల్టన్ పోరాటం పెంచాడు. సర్వీస్‌తో పాటు ర్యాలీల్లోనూ జ్వెరెవ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో సెట్ టైబ్రేక్‌కు వెళ్లింది. అయితే కీలక సమయంలో జ్వెరెవ్ తన స్థాయిని చూపించాడు. 5-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి టైబ్రేక్‌ను 7-2తో గెలుచుకున్నాడు. దీంతో మ్యాచ్‌లో 2-0తో ముందంజ వేశాడు.
మూడో సెట్ అతడిదే
రెండు సెట్లు కోల్పోయినా షెల్టన్ వెనక్కి తగ్గలేదు. మూడో సెట్‌లో మరింత దూకుడుగా ఆడుతూ జ్వెరెవ్ రిథమ్‌ను దెబ్బతీశాడు. 3-3 వద్ద జ్వెరెవ్ సర్వీస్‌పై తొలి బ్రేక్‌పాయింట్ అవకాశాన్ని సృష్టించాడు. దానిని జర్మన్ ఆటగాడు కాపాడుకున్నప్పటికీ.. షెల్టన్‌కు నమ్మకం పెరిగింది. 5-5 తర్వాత షెల్టన్ కీలక సమయంలో పుంజుకున్నాడు. జ్వెరెవ్ సర్వీస్‌పై వరుసగా మూడు సెట్ పాయింట్లు సాధించాడు. ఒకదాన్ని కోల్పోయినా రెండో అవకాశంలో జ్వెరెవ్ ఫోర్‌హ్యాండ్ వాలీ బయటకు వెళ్లడంతో బ్రేక్ సాధించాడు. చివరకు 7-5తో మూడో సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో ఉత్కంఠ పెంచాడు.
నాలుగో సెట్‌లో ఛాంపియన్ గేమ్
ఇక్కడే జ్వెరెవ్ తన కాన్ఫిడెన్స్‌ను ప్రదర్శించాడు. గతంలో యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆధిక్యాన్ని కోల్పోయిన అనుభవం ఉన్నా ఈసారి ఆ తప్పును పునరావృతం చేయలేదు. నాలుగో సెట్ ఆరంభంలోనే షెల్టన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 2-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. షెల్టన్ పోరాడుతున్నా జ్వెరెవ్ కంట్రోల్ తప్పలేదు. 4-2 వద్ద మరోసారి సర్వీస్ బ్రేక్ సాధించి టైటిల్‌కు మరింత చేరువయ్యాడు. 5-2 వద్ద ఛాంపియన్‌షిప్ కోసం సర్వ్ చేస్తూ ఒక డబుల్ ఫాల్ట్ చేసినా వెంటనే ఏస్, ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో పుంజుకున్నాడు. చివరకు షెల్టన్ ఫోర్‌హ్యాండ్ బయటకు కొట్టడంతో మ్యాచ్ ముగిసింది.
టైటిల్ గెలిచిన అనంతరం జ్వెరెవ్ తన తల్లికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఆమె ప్రొత్సాహం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని భావోద్వేగానికి గురయ్యాడు.
ఆరేళ్ల తర్వాత నెరవేరిన కల
2020 యూఎస్ ఓపెన్ ఫైనల్లో రెండు సెట్ల ఆధిక్యంలో ఉన్న జ్వెరెవ్ డొమినిక్ థీమ్ చేతిలో ఓడిపోయాడు. ఆ చేదు జ్ఞాపకాన్ని అధిగమిస్తూ ఆరేళ్ల తర్వాత అదే వేదికపై టైటిల్ అందుకున్నాడు. మరోవైపు షెల్టన్ 2003లో ఆండీ రాడిక్ తర్వాత గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి అమెరికా మెన్స్ విన్నర్‌గా నిలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగినా ఆ కల నెరవేరలేదు.
ఇప్పుడు.. ఈ విజయంతో జ్వెరెవ్ 2026లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాడు. అంతకుముందు ఫ్రెంచ్ ఓపెన్‌లో తన తొలి గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్నాడు. యూఎస్ ఓపెన్ విజయం అతడి కెరీర్‌లో 26వ టైటిల్‌గా నిలిచింది. 1989లో బోరిస్ బెకర్ తర్వాత యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి జర్మన్ ఆటగాడిగా కూడా జ్వెరెవ్ రికార్డు సృష్టించాడు. అంతేకాదు.. యూఎస్ ఓపెన్ టైటిల్‌తో జ్వెరెవ్ తన గ్రాండ్‌స్లామ్ ప్రయాణంలో మరో పెద్ద అడ్డంకిని అధిగమించాడు. ఇక 2026 సీజన్‌ను రెండు మేజర్ టైటిళ్లతో ముగించే దిశగా దూసుకెళ్తున్నాడు.
ఇదీ చదవండి: యూఎస్ విమెన్ సింగిల్స్ విజేతగా రిబాకినా


